Manipur Violence : తాజాగా మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఇంఫాల్‌లో మంగళవారం ఓ సీనియర్ పోలీస్ అధికారిని మైతేయి వర్గానికి చెందిన సాయుధులు కిడ్నాప్ చేశారు. ఆ పోలీస్ అధికారిని కొన్ని గంటల వ్యవధిలోనే విడిపించిన అధికారులు సమస్యాత్మక ప్రాంతాల్లో ఆర్మీని మోహరించారు. నాలుగు కాలమ్‌ల అసోం రైఫిల్స్ బలగాలను ఇంఫాల్‌లో మోహరించినట్లు అధికారులు వెల్లడించారు.
మంగళవారం పోలీస్ అదనపు సూపరెండెంట్ అయిన అమిత్ కుమార్ ఇంటికి మైతేయి సభ్యులు గన్లతో వచ్చారు. అక్కడ ఇష్టారాజ్యంగా భీకరంగా కాల్పులు జరిపారు. నాలుగు వాహనాలను ధ్వంసం చేశారు. వాహనాలు, ఇతర వస్తువులు అన్నింటిపైనా కాల్పులు జరిపి భయాందోళనలు సృష్టించారు. తర్వాత అమిత్ కుమార్‌ని కిడ్నాప్ చేసి అక్కడి నుంచి తీసుకువెళ్లిపోయారు.
ఈ సంఘటనతో అప్రమత్తమైన పోలీస్ అధికారులు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. కొద్ది గంటల్లోనే ఆయనను వారి చెర నుంచి విడిపించి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో ఉన్నారని, ఆరోగ్యం నిలకడగానే ఉందని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఈ సమయంలోనే మణిపూర్ (Manipur) పోలీసులు ఆర్మీ అధికారుల సాయం కోరారు. దీంతో ఘటన జరిగిన ప్రాంతంలో అసోం రైఫిల్స్ బలగాలను మోహరించారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు నిలకడగా ఉన్నాయి.