natural cleansers and soap Alternatives: మనం చర్మాన్ని శుభ్రం చేసుకోవడానికి వాడే సబ్బుల్లో రసాయనాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల అవి మన చర్మాన్ని కాంతి విహీనంగా మార్చే అవకాశాలూ ఉంటాయి. కాబట్టి స్థానంలో వాడుకోగల సహజమైన క్లెన్సర్లు(natural cleansers) ఏమిటో తెలుసుకుందాం. సబ్బుకు బదులుగా వాటిని వాడితే ఏం జరుగుతుందో అనుభవపూర్వకంగా తెలుసుకుందాం. వీటిల్లో ఎలాంటి రసాయనాలూ ఉండవు కాబట్టి వాడితే ఏం అవుతుందో అన్న భయమూ అవసరం లేదు.
బొప్పాయి, కమలా, కీర, టమోటా… లాంటి ముక్కల్ని మెత్తని పేస్ట్‌లా చేసుకుని దానితో శరీరాన్ని రుద్దుకుని స్నానం చేయవచ్చు. వీటిలో ఉండే సహజ పోషకాల వల్ల శరీరం సాఫ్ట్‌గా తయారవుతుంది. చక్కగా శుభ్రపడుతుంది. అలాగే పాలు, నూనె రెండూ చర్మాన్ని సహజంగా క్లెన్స్ చేస్తాయి. మృదువుగా ఉంచుతాయి. బకెట్లో ఓ కప్పుడు పాలను పోసి, సహజమైన సబ్బుతో స్నానం చేసి చూడండి. చర్మంపైన ఉన్న మృత కణాలు అన్నీ తొలగిపోయి, అది ఎంతో మృదువుగా మారుతుంది. అలాగే పొడి చర్మం ఉన్న వారు సబ్బు వాడటం కంటే నూనెను వాడటం మంచిది. చర్మాని కొద్దిగా నూనెను పట్టించి ఇరవై నిమిషాల పాటు అలా వదిలేయండి. తర్వాత సున్నిపిండితో లేదా కలబంద గుజ్జుతో శరీరాన్ని రుద్దుకుని, గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే సరిపోతుంది.
కమలా పండ్లు తిన్నాక వచ్చే తొక్కలను ఎండలో ఎండబెట్టుకోవాలి. ఇవి బాగా ఎండిన తర్వాత మిక్సీలో మెత్తటి పొడిలా చేసుకోవాలి. దీన్నిబాత్ పౌడర్లా శరీరానికి రుద్దుకుని స్నానం చేయాలి. దీనిలో ఉండే విటమిన్ సీ కొలాజిన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. మృత కణాలను తొలగిస్తుంది. అందువల్ల చర్మం మరింత తెల్లగా, కాంతివంతంగా తయారవుతుంది. అలాగే రసాయనిక సబ్బులకు ప్రత్యామ్నాయంగా సేంద్రీయ సబ్బులను వాడొచ్చు. మొక్కల నుంచి వచ్చే నూనెలతో ఈ సబ్బులు తయారవుతాయి. కాబట్టి వీటిని వాడటం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. గ్లిజరిన్‌ని తీసుకుని కరిగించి దాంట్లో మనకు నచ్చిన పండ్ల రసాన్ని కలిపి అచ్చులా పోసుకుంటే సహజమైన సబ్బు(natural soap) రెడీ అయినట్లే.