అవినీతి అనేది కొత్తేమీ కాదని.. తామేమి సత్యవంతులం కాదని ఓ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నోరు జారాడు. గత ప్రభుత్వం అధికంగా అవినీతి జరిగింది.. మా ప్రభుత్వం కొంత జరుగుతోంది అని తెలిపాడు. ఇది మరింత తగ్గించేందుకే తాము ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అంటే వైఎస్ జగన్ పాలనలో అవినీతి జరుగుతుందని పరోక్షంగా ఆ ఎమ్మెల్యే అంగీకరించినట్టు కనిపిస్తోంది. ఇలా తమ పాలన లోపాలను సొంత పార్టీ ఎమ్మెల్యేలే బయటకు చెబుతుండడం ఇది కొత్తకాదు. గతంలో ఏకంగా మంత్రులు కూడా ఇదే విషయాన్ని బహిరంగంగా చెప్పిన సంఘటనలు ఉన్నాయి. తాజాగా నెల్లూరు జిల్లా కావలి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.
‘ఇప్పటి కన్నా ఎక్కువగా గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అవినీతి జరిగింది. ఈ రోజు అవినీతి అనేది ఉంటది.. ఉండదని ఎవరూ చెప్పలేరు. అవినీతి రూపుమాపాలని ప్రతి నాయకులు, వచ్చిన ప్రతి ప్రభుత్వం చెప్పేదే సహజం. దాన్ని ఎలా నియంత్రించాలని ఆలోచించాల్సిన అవసరం. కొన్ని చోట్ల గ్రావెల్ తవ్వకాల గురించి మాట్లాడుతున్నారు. అయ్య మేం సత్యవంతులమని నేను చెప్పట్లేదు. మా ప్రభుత్వంలో చిన్నచిన్న అవకతవకలు జరుగుతూ ఉండవచ్చు. అప్పట్లో బీద రవిచంద్ర రూ. 400 కోట్ల వరకు దోపిడీకి పాల్పడ్డారు. కానీ తమ పాలనలో జరుగుతున్న గ్రావెల్ తవ్వకాలన్నీ పేదల ఇళ్ల అవసరాలకే జరుగుతున్నాయి’ అని వైఎస్సార్ సీపీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు.