Odysseus lander : ఇప్పటి వరకు నాసా లాంటి పెద్ద అంతరిక్ష సంస్థలు చంద్రుడి మీదకు ల్యాండర్లను పంపించడం చూశాం. మన దేశంలోనూ ఇస్రో లాంటి ప్రభుత్వ సంస్థలు చంద్రయాన్ లాంటి ప్రయోగాలను చేయడం వీక్షించాం. అయితే మొట్ట మొదటి సారి అమెరికాలోని ఓ ప్రైవేటు సంస్థ ఒక ల్యాండర్‌ని చందమామ మీద దిగ్విజయంగా ల్యాండ్ చేయగలిగింది. ఈ విషయాన్ని ఈ ప్రయోగం చేపట్టిన సంస్థ ఇంట్యూటివ్ మెషీన్స్(intuitive Machines) వెల్లడించింది.
గత వారంలోనే ఈ సంస్థ ఈ రాకెట్‌ని ప్రయోగించింది. ఇది విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. తర్వాత ఒడిస్సస్(Odysseus) అనే పేరుగల ల్యాండర్ చంద్రుడి ఉపరితలం మీదకు విజయవంతంగా చేరుకోగలిగింది. అయితే అది ఏ ప్రాంతంలో ల్యాండ్ అయ్యింది? ప్రస్తుతం దాని పరిస్థితి ఏమిటి? అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం ల్యాండర్ నుంచి వస్తున్న బలహీనమైన సిగ్నల్స్‌ని ఎలా మెరుగు పరచాలో విశ్లేషిస్తున్నామని ఆ ప్రాజెక్టు డైరెక్టర్ టిమ్ క్రెయిన్ ప్రకటించారు.
అమెరికా దేశ అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నాసా సంస్థ 1972లో అపోలో మిషన్ పేరుతో చంద్ర మండల యాత్రను చేపట్టింది. ఆ తర్వాత ఆ దేశం చంద్రుడి మీద చేసిన ప్రయోగం ఇదే కావడం గమనార్హం. ఓ ప్రైవేటు సంస్థ ఈ ప్రయోగాన్ని విజయవంతం చేయడం అనేది చాలా గొప్ప విషయమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత నెలలో ఆస్ట్రోబోటిక్ అనే సంస్థ ఈ ప్రయోగం చేసి విఫలం అయ్యింది. కానీ ఇంట్యూటివ్ మెషిన్స్ దీన్ని సఫలం చేయగలిగింది. ఇందుకు గాను నాసా ఈ సంస్థకు 118 మిలియన్ డాలర్ల నిధులను అందజేసింది.