»Corona 10 Thousand Deaths In The Last Month Whos Key Announcement On Corona
Corona: గత నెలలో 10 వేల మరణాలు.. కరోనాపై WHO కీలక ప్రకటన
కరోనా కేసులు పెరుగుతుండటంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక సూచన చేసింది. గత నెలలో 10 వేలకు పైగా మరణాలు నమోదయ్యాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించాలని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది.
కరోనా కేసులు మళ్లీ భయపెడుతున్నాయి. పెరుగుతున్న కేసులను చూసి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చలి వల్ల కేసులు పెరుగుతున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. 2019 డిసెంబర్ నెలలో చైనాలో విజృంభించిన కోవిడ్ కేసులు ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపేశాయి. కరోనా వల్ల అప్పట్లో లక్షలాది మంది ప్రాణాలు వదిలారు.
తగ్గిపోయిందని అనుకున్న కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ఇప్పటికే కరోనా వేరియంట్లు ప్రజల ప్రాణాలు తీస్తూ టెన్షన్ పెట్టిస్తున్నాయి. తాజాగా భారత్ లో నమోదవుతున్న కేసులను చూసి డబ్బ్యూహెచ్ఓ కీలక ప్రకటన చేసింది. కరోనా ఇంకా ప్రమాదకరంగానే ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, కరోనా నియమాలను పాటించాలని సూచించింది.
గత నెలలో సుమారు 10 వేల మందకి పైగా మరణించారని డబ్ల్యూహెచ్ఓ సంస్థ చీఫ్ టెడ్రోస్ అథనామ్ వెల్లడించారు. మరణాల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, నవంబర్ నెలతో పోల్చితే డిసెంబర్ నెలలో 42 శాతం మంది ఎక్కువగా ఆస్పత్రి పాలైనట్లు తెలిపారు. 62 శాతం మంది ఐసీయూలో చేరి చికిత్స పొందినట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని, వ్యాక్సినేషన్ వంటి జాగ్రత్తలు పాటించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.