»Uppal Mla Bheti Subhash Reddy Is Unhappy With Brs
MLA: నిజాయితీగా ఉంటే నిండా ముంచారు.. త్వరలో నా నిర్ణయాన్ని ప్రకటిస్తా
టీఆర్ఎస్ స్థాపించిన నాటి నుంచి పార్టీలో ఉన్నానని, నిఖార్సైన ఉద్యమకారుడిగా నీతినిజాయితీతో పనిచేస్తే పార్టీ అవమానించిందని ఉప్పల్ ఎమ్మెల్యే భేతి శుభాష్ రెడ్డి మీడియా ముందు తన ఆవేదన వ్యక్తం చేశారు. అధిష్టానం స్పందించకుంటే త్వరలో తన నిర్ణయం ప్రకటిస్తానన్నారు.
MLA: భారత రాష్ట్ర సమితి(BRS) పార్టీ బాస్ కేసీఆర్(KCR) మొదటి విడత ఎమ్మెల్యేల(MLA) ప్రకటనలో కొంత మందికి నిరాశ మిగిల్చారు. అందులో ఉప్పల్ నియోజకవర్గ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి(Bheti Subhash Reddy ) పార్టీ బీఫామ్ ఇవ్వలేదన్న విషయం తెలిసిందే. తన బదులు బండారు లక్ష్మారెడ్డికి( Bandaru Lakshmareddy) పార్టీ అధిష్టానం ఎమ్మెల్యే టికెట్టు ఇచ్చింది. అయితే ఈ వ్యవహారం అంతా అయిపోయి దాదాపు రెండు వారాలు తరువాత టికెట్ కేటాయించకపోవడంపై మీడియా ముందుకు వచ్చిన ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి అసంతృప్తి, ఆవేదనను వ్యక్తం చేశారు. మంగళవారం తన కుటుంబం, అనుచరులతో మీడియా సమావేశంలో మాట్లాడారు. గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న ఒకేఒక్క ఉద్యమకారుడు తానే అని చెప్పారు. అలాంటిది నగరంలోని తన ఒక్క సీటే తొలగించడం బాధగా అనిపిస్తోందన్నారు. 2001 నుంచి తాను పార్టీలోనే ఉన్నడని, ఆయన తరువాత వచ్చిన పద్మారావు గౌడ్ మంత్రి అయ్యారని పేర్కొన్నారు. తాను పార్టీ కోసం నిజాయితీగా పని చేశానని వాపోయారు. అతికష్టం మీద ఉప్పల్లో పార్టీని నడిపించాడని, ఇప్పుడు ఉప్పల్లో బీఆర్ఎస్కు మంచి క్యాడర్ ఉందని వెల్లడించారు. ఎవరైనా ఎమ్మెల్యే అయ్యాక ఆస్తులు పెంచుకుంటారని తాను ఉన్న ఆస్తులు అమ్ముకున్నాని అడ్డగోలుగా సంపాదించిన వారికి టికెట్టు వచ్చిందని వాపోయారు.
ప్రస్తుతం ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారు లక్ష్మారెడ్డిపై పలు ఆరోపణలు చేశారు. ఆయన మొదటి నుంచి కాంగ్రెస్ జెండా మోశారని, తన అన్న కాంగ్రెస్ నేత అని, ఇప్పుడు తన ఫోటో పెట్టుకొనే ప్రచారం చేస్తున్నారని అలాంటి వాడికి అధిష్టానం టికెట్టు ఎలా ఇస్తుందన్నారు. అయినా టికెట్టు ఇచ్చే ముందు ఒక్క సారిగా తనకు సమాచారం ఇవ్వలేదని, ఏ తప్పు చేయకున్నా తనను బలి చేశారన్నారు. టికెట్ ఇవ్వనందుకు తన కుటుంబం రోడ్డెక్కి ధర్నా చేస్తా అందని, తన క్యాడర్ ఆందోళన చేస్తామంటే తాను వారికి సర్ధి చెప్పి పార్టీ పరువు కాపాడనన్నారు. ఇంత జరుగుతున్న తనను పార్టీ ముఖ్య నేతలు పిలిచి మాట్లాడలేదని, ఇప్పటి వరకు ఏ పార్టీ ఆహ్వానం అందలేదని, మరో వారం రోజులు చూసి తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని తెలిపారు.