»Union Minister G Kishan Reddy To Flag Off Several Trains To Improve Rail Connectivity In Telangana
G Kishanreddy: మెరుగుపడనున్న ఏపీ తెలంగాణ రైలు కనెక్టివిటీ.. పలురైళ్లకు పచ్చ జెండా ఊపనున్న కిషన్ రెడ్డి
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రైలు ప్రయాణీకుల సౌకర్యార్థం రైలు కనెక్టివిటీని మెరుగుపరచడానికి భారత ప్రభుత్వం మరో అడుగు వేసింది. అనేక వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనుంది.
G Kishanreddy: తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రైలు ప్రయాణీకుల సౌకర్యార్థం రైలు కనెక్టివిటీని మెరుగుపరచడానికి భారత ప్రభుత్వం మరో అడుగు వేసింది. అనేక వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనుంది. ఈ క్రమంలో రెండు రాష్ట్రాల్లోనూ కొత్త రైల్వే లైన్లు, డబ్లింగ్, ట్రిప్లింగ్, విద్యుదీకరణ వంటి మూలధన వ్యయ ప్రాజెక్టులను వేగవంతం చేయడానికి రైల్వే మంత్రిత్వ శాఖ చొరవ తీసుకోనుంది. అందులో భాగంగా కేంద్ర పర్యాటక శాఖ, సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అభ్యర్థన మేరకు మరో 4 రైళ్లను పొడిగించేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది.
సోమవారం సికింద్రాబాద్ స్టేషన్ నుంచి.. కాజీపేట టూ హడప్సర్ (పుణె) వెళ్లే రైలును కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఆ తర్వాత కర్నూలు-జైపూర్, బోధన్-కరీంనగర్, రాయచూర్-నాందేడ్ రైళ్లకు కూడా పచ్చజెండా ఊపనున్నారు. ఈ రైళ్లు సోమవారం ఉదయం 9:00 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్ నంబర్ 10 నుండి ఫ్లాగ్ ఆఫ్ చేయబడతాయి. ఆయా ప్రాంతాల నుంచి నడిచే రైళ్ల సంఖ్యను విస్తరించడం ద్వారా ప్రయాణికులకు రైల్వే సేవలను మరింత అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ రాష్ట్రం గుండా వెళ్లే వివిధ రైళ్ల గమ్యస్థానాలను విస్తరించాలని భారతీయ రైల్వే నిర్ణయించింది.
ఈ రైలు సేవలు తెలంగాణ ప్రజలకు అత్యంత సుదూర ప్రాంతాలకు అదనపు ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తాయి. కాజీపేట ప్రజలు పూణే వరకు ప్రయాణించడానికి సౌకర్యవంతమైన రాత్రి ప్రయాణ సౌకర్యం పొందుతారు. షాద్‌నగర్, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూలు నగరాల ప్రజలకు జైపూర్ వైపు నేరుగా, సౌకర్యవంతమైన ప్రయాణ సౌకర్యం లభిస్తుంది. అదేవిధంగా, కర్ణాటకలోని సేడం, చిత్తాపూర్, యాద్గిర్, రాయచూర్ చుట్టుపక్కల ప్రజలు ఈ పొడిగించిన రైలు సర్వీస్ ద్వారా నాందేడ్ వైపు ప్రయాణించగలరు. కరీంనగర్-నిజామాబాద్-బోధన్ ప్యాసింజర్ స్పెషల్ పగటిపూట నడుస్తుంది. రెండవ జనరల్ క్లాస్ కోచ్‌లను కలిగి ఉంటుంది.