తెలంగాణ (Telangana) అవతరణ దశాబ్ధి ఉత్సవాలకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ప్రధాన కార్యదర్శి శాంతికుమారి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్న ఈ కమిటీకి రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ అశోక్‌రెడ్డి కన్వీనర్‌గా ఉంటారు. మొత్తం పన్నెండు మంది సభ్యులుండే ఈ కమిటీలో వివిధ శాఖల అధికారులు, సలహాదారు కేవీ రమణాచారి (రిటైర్డ్ ఐఏఎస్), ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ (MLC Deshapati) తదితరులు కూడా ఉన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ధి వేడుకలను 21 రోజుల పాటు నిర్వహించాలని సీఎం కేసీఆర్ (CM KCR) నిర్ణయించారు. జూన్ 2 నుంచి 21 రోజులపాటు కొనసాగనున్నాయి. తొలి రోజు హైదరాబాద్‌లో తెలంగాణ సచివాలయంలో ప్రారంభిస్తారు. సచివాలయ ఉద్యోగులు సహా అన్ని శాఖల హెచ్ఓడీలు, ఉద్యోగులందరూ హాజరవుతారు.
అమరవీరులను స్మరించుకునేందుకు ఒకరోజును ప్రత్యేకంగా ‘మార్టియర్స్ డే (Martyrs Day)’గా జరుపాలన్నారు. అమరుల స్మారక దినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అమరుల స్థూపాలను పుష్పాలతో అలంకరించి, విద్యుద్దీపాలతో వెలిగించి.. గ్రామ గ్రామాన తెలంగాణ అమర వీరులను స్మరిస్తూ నివాళులు అర్పించాలని నిర్ణయించారు. అలాగే జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేయాలి. ఈ సందర్భంగా అమరుల త్యాగాలను స్మరిస్తూ తుపాకీ పేల్చి పోలీసులు (police) అధికారికంగా గౌరవ వందనం చేయననున్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు మార్టియర్స్ డేలో పాల్గొంటారు. అన్ని ప్రభుత్వ శాఖలు కూడా అమరుల సంస్మరణ సహా ఉత్సవాల్లో పాల్గొంటాయి.