Liquor Sales: తెలంగాణ ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తోంది. మరోవైపు ఎక్సైజ్ పాలసీ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో మద్యం విక్రయాలపై ఎక్సైజ్ శాఖ దృష్టి సారించింది. ఎంఆర్పి ధర కంటే తక్కువ ధరకు విక్రయించవద్దని వ్యాపారులకు స్పష్టం చేసింది. అలా విక్రయిస్తే చర్యలు, శిక్షలు తప్పవని హెచ్చరించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2620 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఈ నెల 30న తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 28 నుంచి 30వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి మద్యం అమ్మకాలను నిలిపివేయాల్సి ఉంటుంది. దీంతో పాటు ప్రస్తుత మద్యం పాలసీ గడువు ఈ నెల 30తో ముగియనుంది. డిసెంబర్ 1 నుంచి కొత్త లైసెన్సుదారులు విక్రయాలు ప్రారంభించనున్నారు.దీంతో మద్యం వ్యాపారులు తమ దుకాణాల్లో ఉన్న నిల్వలను ఆ లోపు ఖాళీ చేయాల్సి వస్తోంది. ఈ లెక్కన 27, 30 తేదీల్లో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే వ్యాపారులు మద్యం మొత్తం విక్రయించాలి.
ఎంఆర్పీ కంటే తక్కువ ధరలకు మద్యం విక్రయిస్తున్న వ్యాపారులు తక్కువ వ్యవధిలో తమ వద్ద ఉన్న నిల్వలను క్లియర్ చేస్తారనే ఉద్దేశంతో ఎక్సైజ్ అధికారులు నిఘా పెంచారు. ఎంఆర్పి కంటే తక్కువ ధరకు మద్యం విక్రయించరాదని ఎక్సైజ్ కమిషనర్ జ్యోతిబుద్ధ ప్రకాశ్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఎక్సైజ్ నిబంధనల ప్రకారం ఎంఆర్ పీ కంటే తక్కువ ధరకు మద్యం విక్రయిస్తే రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు జరిమానా విధించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. నేరం రుజువైతే 6 నెలల నుంచి రెండేళ్ల వరకు జైలు శిక్ష తప్పదని మద్యం వ్యాపారులకు అవగాహన కల్పిస్తున్నారు.