Hardik Pandya: హార్దిక్ పాండ్యాపై ఐపీఎల్ బోర్డు భారీ జరిమానా
ఉత్కంఠపోరులో పంజాబ్ కింగ్స్ పై ముంబై ఇండియన్స్ విజయం సాధించిన విషయం తెలిసిందే. రాత్రి జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఆట తీరుపై ఐపీఎల్ బోర్డు అసహనం వ్యక్తం చేసింది. కెప్టెన్ హార్ధిక్ పాండ్యాపై భారీ జరిమానా విధించింది.
Hardik Pandya: ఐపీఎల్ మ్యాచ్ అంటే ఏంటో గతరాత్రి మరోసారి రుజువైంది. చివరి బంతి వరకు అందరిలో ఒకే ఉత్కంఠత. ముల్లాన్‌పుర్ వేదికగా పంజాబ్ జట్టుపై ముంబై స్వల్ప తేడాతో విజయం సాధించింది. చివరి బంతి వరకు ఎంతో ఆసక్తిగా కొనసాగిన ఈ మ్యాచ్‌లో ముంబై 9 పరుగుల తేడాతో గెలిచింది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ కారణంగా ముంబై రథసారధి హార్ధిక్ పాండ్యాపై ఐపీఎల్ బోర్డు భారీ జరిమానా విధించింది. స్లో ఓవర్ రేట్ కారణంగా రూ. 12 లక్షలను ఫైన్ వేసినట్లు ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ తెలిపింది. 20 ఓవర్లను పూర్తి చేయడంలో ఆలస్యం కారణంగా ఈ ఫైన్ వేసినట్లు కమిటీ చెప్పింది. చివరి రెండు ఓవర్లు సర్కిల్ అవతల నలుగురు ఫీల్డర్లు మాత్రమే ఉన్నారు. వీటన్నింటి దృష్ట్యా ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు జరిమానా విధించామని కమిటీ ప్రకటించింది.
మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణిత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. సెకండ్ ఇన్నింగ్ ప్రారంభించిన పంజాబ్ మొదట తడబడినా తరువాత 183 పరుగులు చేసింది. మ్యాచ్ అనంతరం హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. పంజాబ్‌తో ఆట చాలా ఉత్కంఠబరితంగా సాగిందని, ఎన్నో పరీక్షలను దాటుకొని విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఎప్పుడూ మనమే గెలవాలి అనుకోవడంలో ఎలాంటి తప్పు లేదని, కానీ ఐపీఎల్ ఆటలో ఎప్పుడు ఏం జరుగుతుందో అంచనా వేయడం చాలా కష్టమన్నారు. అశుతోష్ చక్కటి ప్రదర్శన కనబరిచాడని, ప్రతీ బంతిని అద్భుతంగా ఆడాడని పేర్కొన్నారు. అతడికి మంచి భవిష్యత్తు ఉందన్నారు.