టీఎస్పీఎస్సీ (TSPSC) పేపర్ లీకేజీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకున్న విద్యుత్ శాఖ డీఈ రమేష్(DE Ramesh)ను సిట్ అధికారులు విచారించగా షాకింగ్ అంశాలు బయటికి వచ్చాయి. కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధితో రమేశ్ ఒప్పందం చేసుకున్నట్లుగా ఈ విచారణలో వెల్లడైనట్లుగా తెలుస్తోంది. బొమ్మకల్ మాజీ ఎంపీటీసీ (MPTC) కూతురు… రమేశ్ ద్వారా ఏఈఈ పరీక్షను రాసినట్లు తేలింది. ఏఈఈ ఉద్యోగం ఇప్పిస్తానని రమేశ్ రూ.75 లక్షలకు బేరం కుదుర్చుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఏఈఈ పరీక్ష జనవరి 22న జరిగింది. ఈ పరీక్షకు నెల రోజుల ముందే సదరు మాజీ ఎంపీటీసీని రమేశ్ కలిశాడు. పరీక్షకు ముందు ఆమెకు ఎలక్ట్రానిక్ డివైస్ (Electronic device) ఇచ్చాడు. తన కూతురుకు ఉద్యోగం వచ్చాకనే డబ్బులు చెల్లిస్తానని రమేశ్ తో చెప్పాడు.
ఎలక్ట్రానిక్ డివైజ్ జాకెట్ కోసం కూడా ఎలాంటి డబ్బులు ఇవ్వలేదని తెలుస్తోంది. డీఈ రమేశ్ 80 మందికి ఏఈఈ పేపర్లు అమ్మినట్లుగా గుర్తించారు. ఒక్కొక్కరి నుండి కనీసం రూ.30 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడని తెలుస్తోంది. ఇక రమేష్ విచారణతో మరికొందరు మందిని అరెస్ట్ చేసేందుకు సిట్ అధికారులు (SIT officials) రంగం సిద్ధం చేస్తున్నారు.ఇదిలా ఉండగా, బోర్డు ఈనెల 11న నిర్వహించనున్న గ్రూప్1 ప్రిలిమ్స్ పరీక్షపై తాజాగా మరో పిటిషన్ హైకోర్టులో దాఖలయ్యింది. పరీక్షల ప్రశ్నాపత్రాలు లీకైన సమయంలో ఉన్న సిబ్బందితోనే బోర్డు గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష(Group-1 Prelims Exam) నిర్వహించనుండటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొందరు ఈ పిటిషన్ వేశారు. పరీక్షను వాయిదా వేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును కోరారు. దీనిపై విచారణ జరగాల్సి ఉంది. మరోవైపు బోర్డు ఇప్పటికే గ్రూప్1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించి హాల్ టికెట్లను ఇప్పటికే జారీ చెయ్యటం గమనార్హం.