Video: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఇంటి ముందు షెజల్ ధర్నా
అరిజన్ డైరీ సీఈవో షెజల్ ఆందోళనల పర్వం కొనసాగుతోంది. బెల్లంపల్లిలో గల ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య క్యాంప్ ఆఫీసు ఎదుట ఈ రోజు ధర్నా చేపట్టింది. ఎమ్మెల్యే చిన్నయ్య అనుచరులు తనను బెదిరిస్తున్నారని వాపోయింది. న్యాయం చేయాల్సిన పోలీసులు ఎమ్మెల్యే వైపు ఉన్నారని ఆరోపించింది.
Sejal: బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై (durgam chinnaiah) అరిజిన్ డైరీ సీఈవో షెజల్ (Sejal) ఆందోళనల పర్వం కొనసాగిస్తూనే ఉంది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు తన గళాన్ని వినిపిస్తోంది. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఇల్లు (క్యాంప్ ఆఫీసు) ముందు ఈ రోజు మెరుపు ధర్నా నిర్వహించింది. గేటు వద్ద తనకు న్యాయం కావాలని ఫ్లకార్డు పట్టుకొని కూర్చొంది. దుర్గం చిన్నయ్య తనను లైంగికంగా వేధించాడని మరోసారి ఆరోపించింది. చాలామంది అమ్మాయిల జీవితాలను నాశనం చేశాడని మండిపడింది.
ఎమ్మెల్యే అనుచరులు గత కొన్నిరోజులుగా తనను బెదిరిస్తున్నారని షెజల్ (Sejal) గుర్తుచేశారు. తనకు న్యాయం చేయాలని కోరితే.. పోలీసులు ఎమ్మెల్యే చిన్నయ్యకు మద్దతుగా నిలిచారని అంటోంది. ఆడబిడ్డ న్యాయం చేయాలని కోరితే.. సపోర్ట్ చేయడం లేదన్నారు. క్యాంప్ ఆఫీసుకు పిలిపించి, పోలీసులతో కిడ్నాప్ చేయించి అక్రమంగా జైలులో బంధించారని గుర్తుచేశారు. పోలీసులకు అక్కా చెల్లెలు లేరా.. తనలాంటి బిడ్డలు లేరా అని అడిగారు. ఉంటే ఇలానే చేస్తారా అని నిలదీశారు.
అరిజిన్ డైరీకి ఇచ్చిన భూమిని ఎమ్మెల్యే అమ్ముకుంటున్నారని.. ఓకే భూమిని ఎంత మందికి ఇస్తారని షెజల్ నిలదీశారు. దమ్ముంటే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుకు రావాలని ఛాలెంజ్ చేశారు. ఎమ్మెల్యే అనుచరులు భీమ గౌడ్, సున్నపు రాజు తనను బెదిరిస్తున్నారని తెలిపారు. తనపై తప్పుడు కేసులు ఉన్నాయని అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. 2012 నుంచి తనపై కేసులు ఉన్నాయని చెబుతున్నారని.. అప్పుడు తాను ఆరో తరగతి చదువుతున్నానని వివరించారు.
ఎమ్మెల్యే ఇంటి ముందు దీక్ష చేస్తున్నానని.. పోలీసులు భగ్నం చేయొద్దని షెజల్ (Sejal) కోరారు. అయినప్పటికీ పోలీసులు ఆమెను బెల్లంపల్లి స్టేషన్-1కు తీసుకెళ్లారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు సపోర్ట్ చేయడం పట్ల సిగ్గు లేదా అని అడిగారు. షెజల్ (Sejal) సిగ్గు లేదా అనగా.. లూజ్ టాక్ చేయొద్దు అని ఓ పోలీస్ అధికారి స్పందించారు. మళ్లీ తప్పుడు కేసులు పెడతారా అని షెజల్ మండిపడ్డారు. తనకు న్యాయం జరగడం లేదని వాపోయారు.