తెలంగాణలో ప్రజాపాలన కార్యక్రమాలు మొదలైయ్యాయి. గురువారం నుంచి అభయహస్తం దరఖాస్తులను అధికారులు స్టార్ట్ చేశారు. కొంతమంది దీన్ని ఆసరాగా భావించి అభయహస్తం దరఖాస్తులను అమ్ముతున్నారు. ఈ అమ్మకంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
Revanth Reddy: తెలంగాణ(Telangana) రాష్ట్రంలో ప్రజాపాలన కార్యక్రమాలను అధికారులు గురువారం నుంచే మొదలు పెట్టారు. దీనిలో భాగంగా ప్రజలకు అభయహస్తం(Abhayahastam) దరఖాస్తులు అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 5 గ్యారెంటీల కోసం అందరూ దరఖాస్తు చేసుకొంటున్నారు. ఈ నేపథ్యంలో కొంత మంది కేటుగాల్లు వీటిని అమ్ముతున్నారు. ప్రజల అవసరాల దృష్ట్యా రూ. 50 నుంచి రూ. 100 వరకు విక్రయిస్తున్నారు. అవసరం అయిన ప్రతీ కుటుంబానికి అధికారులే వీటిని ఇస్తారు అని ప్రభుత్వం చెప్పినా, ప్రజల అమాయకత్వాన్ని కొందరు ఆసరాగా తీసుకుంటున్నారు. దీనిపై సీఎం రెవంత్ రెడ్డి(Revanth Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజాపాలన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి సచివాలయంలో ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. దీనిలో భాగంగా అభయహస్తం దరఖాస్తుల అమ్మకాలపై మండిపడ్డారు. దరఖాస్తులను ఎవరైనా అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు అవసరమైన దరఖాస్తులను ప్రజాపాలనలో అందించాలని స్పష్టం చేశారు. అలాగే రైతు భరోసా, పింఛన్లపై ఎలాంటి అపోహాలను నమ్మొద్దని, పాత లబ్ధిదారులందరికీ యథావిదిగా వస్తాయని చెప్పారు. కొత్తగా లబ్ధి పొందాలనుకునేవారే దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించారు.