Rain Alert : తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మార్చి మధ్యలో బండలు పగిలిపోయే స్థాయికి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సూర్యుడు మండిపోతున్నాడు. ఈ క్రమంలో వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. త్వరలోనే వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆది, సోమ, మంగళవారాల్లో తెలంగాణలో (17 నుంచి 19 వరకు) ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌లోని భారత వాతావరణ శాఖ (ఐఎండీఏ) అంచనా వేసింది. హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. మార్చి 18 వరకు ఉదయం వేళల్లో నగరంలో పొగమంచు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. కాగా, తెలంగాణలోని పలు జిల్లాల్లో గురువారం 41 డిగ్రీల సెల్సియస్‌కు దగ్గరగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిర్మల్ జిల్లాలో అత్యధికంగా 40.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లోనూ గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా నమోదైంది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.