Medico Preethi: ర్యాగింగ్ విషయం తెలియదన్న ప్రిన్సిపల్
సైఫ్ (saif) రూపంలో ర్యాగింగ్ భూతానికి బలైన వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ (KMC) విద్యార్థిని ప్రీతి నాయక్ వేధింపుల పర్వం గురించి కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ (Kakatiya Medical College) మోహన్ దాస్ స్పందించారు.
సైఫ్ (saif) రూపంలో ర్యాగింగ్ భూతానికి బలైన వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ (KMC) విద్యార్థిని ప్రీతి నాయక్ వేధింపుల పర్వం గురించి కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ (Kakatiya Medical College) మోహన్ దాస్ స్పందించారు. ఈ మేరకు ఓ మీడియా ఛానల్ తో ఆయన మాట్లాడారు. మెడికో ప్రీతి పైన వేధింపులకు పాల్పడిన అంశం తమ దృష్టికి రాలేదని తెలిపారు. యాంటీ ర్యాగింగ్ కమిటీ మంగళవారం సమావేశం కావాల్సి ఉండెనని, కానీ రేపటికి వాయిదా పడినట్లు చెప్పారు. ఏసీపీ గారు లేకపోవడంతో… ఆయన అధికారిక డ్యూటీ పైన వెళ్లడంతో… కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఆయన ఉండాల్సి ఉందని, అందుకే ఈ మీటింగ్ ను వాయిదా వేసినట్లు చెప్పారు. ఇదే సమయంలో ఆయన ప్రీతి అంశంపై మాట్లాడారు. ప్రీతి ఘటన అనంతరం శుక్రవారం ఫ్యాకల్టీ అందరితో కలిసి మాట్లాడామని చెప్పారు. ఏమయిందో తెలుసుకునే ప్రయత్నాలు చేశామన్నారు. సీనియర్లు… జూనియర్లపై బాసిజం చూపించినట్లుగా తెలిసిందని, దీనిని తగ్గించే దిశగా తాము ఆలోచన చేశామన్నారు. నిన్న సాయంత్రం ప్రీతి మృతి నేపథ్యంలో క్యాండిల్ ర్యాలీ చేశామన్నారు. ఐదు దశాబ్దాల చరిత్ర కలిగిన ఇక్కడ ఈ ఘటన దురదృష్టకరమన్నారు. ప్రతి నెల తాము ఇక నుండి సమావేశాలు నిర్వహిస్తామని, అలాగే ర్యాగింగ్ ను రూపుమాపడంతో పాటు, ఒకవేళ అలాంటి స్ట్రెస్ సమయంలో ఏం చేయాలో కూడా కౌన్సిలింగ్ ఇస్తామన్నారు.
ప్రీతి కేసు(Preeti Case)లో మరో కొత్త కోణం తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. సైఫ్ (saif) ర్యాగింగ్ కారణంగా బాధపడటానికి బదులు చదువు ఆపేసి రమ్మని తండ్రి సూచించారని తెలుస్తోంది. అయితే కాలేజీ అడ్మిషన్ బాండ్ వల్ల ఆమె అక్కడి నుండి వెళ్లలేకపోయారని తెలుస్తోంది. అంటే పీజీలో జాయిన్ అయ్యాక కాలేజీతో రూ.50 లక్షల బాండ్ ను కుదుర్చుకుంది. ఒకవేళ కాలేజీ మధ్యలో ఆగిపోతే రూ.50 లక్షల సొమ్మును చెల్లించాల్సి ఉంటుంది. అందుకే సీనియర్ సైఫ్ వేధింపుల వల్ల కాలేజీ మానేయొచ్చు కదా అని తల్లిదండ్రులు చెప్పినప్పటికీ తాను కాలేజీ మానేస్తే తన తండ్రి రూ.50 లక్షలు ఎలా చెల్లిస్తారనే బాధతో ప్రీతి(Preeti) మదనపడింది. వర్సిటీకి అంత డబ్బు తిరిగి చెల్లించడం కష్టం అని ఆలోచించి ప్రీతి(Preeti) కాలేజీ చదువును కొనసాగించింది. సీనియర్ సైఫ్ వేధింపులు భరించలేక ప్రాణాలు కోల్పోయారు.
ఈ అంశంపై కూడా ప్రిన్సిపల్ స్పందించారు. పీజీ అడ్మిషన్ లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫేజ్ ఉంటాయని, థర్డ్ ఫేజ్ లో సీటు మారడానికి ఉండదని చెప్పారు. ఒకవేళ ఆ సీటును ఎవరైనా వదిలేసినా, మరొకరికి ఇచ్చే అవకాశం కూడా లేదన్నారు. అప్పుడు ఆ సీటు వేస్ట్ అవుతుందన్నారు. ఇంతకుముందు ఈ బాండ్ రూ.5 లక్షలుగా ఉండేదని, ఆ తర్వాత రూ.20 లక్షలకు పెరిగిందని, అయినప్పటికీ చాలామంది వెళ్తుండటంతో, దీనిని రూ.50 లక్షలతో స్ట్రిక్ట్ గా పెట్టారన్నారు. అప్పుడు ఆసక్తి ఉన్న వారే జాయిన్ అవుతారన్నారు. ఉన్న పీజీ సీట్లను కోల్పోకుండా ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పారు. అసలు ప్రీతిని హరాజ్ చేసిన విషయం తమ దృష్టికి రాలేదన్నారు.