మునుగోడు ఎన్నికలు(munugode elections) మరో వారం రోజుల్లో జరగనున్నాయి. ప్రచారం కూడా రేపటితో ముగియనుంది. కాగా.. ఈ ఎన్నిక నేపథ్యంలో…. ఆ నియోజకవర్గానికి తరలించేందుకు ప్రయత్నిస్తున్న రూ.89.91 లక్షల నగదును హైదరాబాద్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
డబ్బు తరలిస్తున్న సమాచారం ముందుగా పోలీసులకు అందడంతో… జూబ్లీహిల్స్ లోని భారతీయ విద్యా భవన్ సమీపంలో దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ కారులో తరలిస్తున్న నగదు పట్టుబడినట్లు పోలీసులు చెప్పారు. కారులో ఉన్న వ్యక్తి కడారి శ్రీనివాస్ గా గుర్తించారు. ఆయన బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యక్తిగత సహాయకుడు జనార్థన్ కు డ్రైవర్ గా గుర్తించారు. నగదును జూబ్లిహిల్స్ లోని త్రిపుర కన్ స్ట్రక్షన్ కంపెనీ నుంచి మునుగోడు తరలిస్తున్న క్రమంలో పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. కారు, నగదును స్వాధీనం చేసుకొని డ్రైవర్ ను జూబ్లిహిల్స్(Jubilee Hills) పోలీస్ స్టేషన్ లో అప్పగించారు.