»Pawans Visit To Janasena In Telangana Election Campaign From Tomorrow
Pawan kalyan: తెలంగాణ ఎన్నికల ప్రచారంలో జనసేన..రేపటి నుంచి పవన్ పర్యటన
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో రేపటి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారంలో పాల్గొననున్నారు. ఈసారి తెలంగాణలో బీజేపీ, జనసేన పార్టీలు ఉమ్మడిగా కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో బీజేపీ సభల్లోనూ, జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న ప్రాంతంలోనూ పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
తెలంగాణ (Telangana) ఎన్నికల ప్రచారాలు (Election campaign) జోరందుకున్నాయి. ప్రధాన పార్టీలన్నీ గెలుపే లక్ష్యంగా ప్రచారాలు నిర్వహిస్తూ హామీల వర్షం కురిపిస్తున్నాయి. అటు ఉమ్మడిగా బీజేపీ (BJP), జనసేన పార్టీలు (Janasena Party) ఎన్నికల బరిలో నిలుస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ (BRS Party) అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రజలకు చేరువవుతోంది. కాంగ్రెస్ పార్టీ (Congress) కూడా తమ మేనిఫెస్టోలో పొందుపరిచిన వరాలను ప్రజలకు తెలియజేస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది.
ఈ నేపథ్యంలో తాజాగా జనసేన పార్టీ (Janasena Party) కూడా తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు సిద్ధమైంది. బుధవారం నుంచి తెలంగాణలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో బీజేపీ 111 స్థానాల్లో పోటీ చేస్తుండగా జనసేన మరో 9 స్థానాల్లో పోటీ పడుతోంది. బీజేపీ, జనసేన ఉమ్మడిగా ఎన్నికల బరిలోకి దిగుతూ ప్రచారం చేస్తున్నాయి.
బుధవారం వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రావు పద్మకు మద్దతుగా జనసేనాని పవన్ (Pawan Kalyan) ప్రచారం చేయనున్నారు. అలాగే 25న తాండూరులో జనసేన అభ్యర్థి అయిన శంకర్ గౌడ్ తరపున కూడా ఆయన ప్రచారం చేస్తారు. 26న కూకట్పల్లిలో జనసేన అభ్యర్థి అయిన ప్రేమ్ కుమార్కు మద్దతుగా ప్రచారం సాగనుంది. అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా పలు సభలలో పాల్గొననున్నారు. ఆ సభల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ పాల్గొనే అవకాశం ఉంది. ఈ విషయాన్ని జనసేన పార్టీ ప్రకటించింది.