• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

గజ వాహనంపై శ్రీవారి ఊరేగింపు

SRCL: జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీవెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఆదివారం పట్టణానికి చెందిన పలువురు దంపతులు దేవాలయంలో ఆండాళమ్మకు ఒడి బియ్యం సమర్పించారు. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మహిళలు ప్రత్యేక పూజలను నిర్వహించారు. సాయంత్రం పట్టణ ప్రధాన రహదారుల గుండా శ్రీవారు గజ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

October 6, 2025 / 09:05 AM IST

నాంపల్లిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

SRCL: వేములవాడ నాంపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో ఇవాళ విద్యుత్ అంతరాయం ఉంటుందని అధికారులు తెలిపారు. నాంపల్లి రూరల్ లైన్‌లో 11 కేవీ కరెంటు మరమ్మత్తులు జరుగుతున్న దృష్ట్యా విద్యుత్ అంతరాయం ఉంటుందన్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు విద్యుత్ ఉండదని విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.

October 6, 2025 / 08:57 AM IST

కోతుల దాడి.. బిహార వ్యక్తికి తీవ్ర గాయాలు

BHNG: సంస్థాన్ నారాయణపురం మండలంలో కోతుల దాడిలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. బీహార్ రాష్ట్రం నుంచి వలస కూలీగా జీవనం సాగిస్తున్న ముక్తార్ అనే వ్యక్తి ఈ దాడిలో గాయపడ్డాడు. అకస్మాత్తుగా ఇంట్లో కూర్చొని ఉండగా కోతులు లోపలికి చొరబడి దాడి చేయడంతో అతని శరీరమంతా తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం ఆయనను చికిత్స కోసం నల్గొండకు తరలించారు.

October 6, 2025 / 08:57 AM IST

సైంటిస్టు అశ్విని, ఆమె తండ్రి విగ్రహాల ఏర్పాటు

KMM: గత ఏడాది వరదల సమయాన ఆకేరు ప్రవాహంలో కారు కొట్టుకుపోవడంతో కారేపల్లి మండలంలోని గంగారం తండాకు చెందిన అగ్రికల్చర్ సైంటిస్టు అశ్విని, ఆమె తండ్రి నూనావత్ మోతీలాల్ మృతి చెందిన విషయం విదితమే. వీరి జ్ఞాపకార్థం అశ్విని సోదరుడు అశోక్ గుడి నిర్మించాడు. గ్రామంలోని తమ వ్యవసాయ క్షేత్రంలో గుడి నిర్మించడమే కాక అశ్విని, మోతీలాల్ విగ్రహాలను ఏర్పాటు చేశారు.

October 6, 2025 / 08:50 AM IST

నేడే ఆఖరి తేదీ

MDK: నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ (NMMS) స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు కోవడానికి ఈనెల 6 చివరి రోజని జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధా కిషన్ తెలిపారు. 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ పొందేందుకు అర్హులని తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు www.bse.telangana.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

October 6, 2025 / 08:43 AM IST

HYDలో 95% పెరిగిన బిల్టప్ ఏరియా

HYD: గత 30 ఏళ్లలో దేశంలోని ప్రధాన నగరాల్లో నిర్మాణాల విస్తీర్ణం రెట్టింపైందని ‘సిటీస్ ఇన్ మోషన్’ పేరుతో స్వైర్‌యార్డ్స్ సంస్థ వెల్లడించింది. హైదరాబాద్‌లో ప్రస్తుతం బిల్టప్ ఏరియా 519 చ.కి.మీ.గా ఉండగా, 1995లో 267 చ.కి.మీ. మాత్రమే ఉంది. ఈ మధ్యకాలంలో 252 చ.కి.మీ. పెరిగి, 95% వృద్ధి నమోదయింది.

October 6, 2025 / 08:41 AM IST

‘RRR రైతుల ముందస్తు అరెస్ట్’

VKB: నవాబుపేట్ మండలం చిట్టిగిద్ద గ్రామ రైతులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. RRR ప్రాజెక్టులో భూములు కోల్పోయి రోడ్డున పడుతున్నామంటూ సోమవారం రైతులు ‘చలో HMDA’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు రైతులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

October 6, 2025 / 08:40 AM IST

గుండెపోటుతో ఏసీపీ మృతి

BDK: హైదరాబాదులో ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న సుబ్బతి విష్ణుమూర్తి ఆదివారం రాత్రి గుండెపోటుతో మరణించారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. వారి స్వస్థలం జూలూరుపాడు మండలం వెంకన్నపాలెం గ్రామంగా తెలిపారు. ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించే ప్రయత్నంలో మార్గ మధ్యలో తుదిశ్వాస విడిచినట్లు చెప్పారు.

October 6, 2025 / 08:40 AM IST

భార్యాభర్తలపైకి దూసుకు వచ్చిన డీసీఎం

JDWL: ఉండవెల్లి మండల పరిధిలో సోమవారం తెల్లవారుజాము పెను ప్రమాదం తృటిలో తప్పింది. కడప జిల్లా ఒంటిమిట్ట నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న డీసీఎం వాహనం 44వ జాతీయ రహదారి పక్కన కాటన్ మిల్లు దగ్గర ఉన్న లేబర్ నివాసముంటున్న గుడిసెలోకి అకస్మాత్తుగా దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో గుడిసెలో నిద్రిస్తున్న భార్యాభర్తలు భాగ్యమతి, వీరా సింగ్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

October 6, 2025 / 08:40 AM IST

‘ఆర్ఎస్ఎస్‌ది అధికార కాంక్ష’

KMM: ఆర్ఎస్ఎస్‌ది అధికార కాంక్ష మాత్రమే కాక విభజన, విధ్వంసం మాత్రమేనని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి తెలిపారు. ఖమ్మం సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కమ్యూనిస్టులు సైద్ధాంతిక నిర్మాణంతో రాజకీయ లక్ష్యం కోసం పనిచేస్తున్నారని చెప్పారు. బలహీనపడినా పునరుతైజం తథ్యమని తెలిపారు. కమ్యూనిస్టులే దేశానికి రక్ష, రాజకీయ ప్రత్యామ్నాయమని స్పష్టం చేశారు.

October 6, 2025 / 08:34 AM IST

నల్లమల టైగర్ సఫారీ షురూ

NGKL: నల్లమల అటవీ ప్రాంతాల సందర్శనకు ప్రకృతి ప్రేమికులు, పర్యాటకుల కోసం సఫారీ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. 3 నెలల పాటు వన్యప్రాణుల సంతానోత్పత్తి సమయంలో నిలిపివేసిన ఈ సేవలను ప్రభుత్వం పునఃప్రారంభించింది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లోని పర్యాటక ప్రాంతాలను, కృష్ణానది, జలపాతాలు, పులులు, చిరుతలను చూసేందుకు అవకాశం కల్పించారు.

October 6, 2025 / 08:34 AM IST

కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎంపీటీసీ, మాజీ సర్పంచ్

ADB: బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ ఆడే గజేందర్ సమక్షంలో టెంబి మాజీ ఎంపీటీసీ సిడం భీంరావు, మాజీ సర్పంచ్ దిగంబర్ జాదవ్, పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు.

October 6, 2025 / 08:33 AM IST

జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. ఒకరికి గాయాలు

MDK: రామాయంపేట 44వ జాతీయ రహదారి అయ్యప్ప దేవాలయం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం నాగపూర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అదనపు డ్రైవర్ రాంజీ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. 108 సిబ్బంది ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

October 6, 2025 / 08:33 AM IST

నేటి నుంచి కాలేజీలు ప్రారంభం

MDK: జిల్లాలో గత నెల 28 నుంచి అక్టోబర్ 5 వరకు దసరా సెలవులు పూర్తి కావడంతో సోమవారం నుంచి అన్ని ఇంటర్ కళాశాలలు ప్రారంభం కానున్నాయని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి మాధవి తెలిపారు. డీఐఈఓ మాట్లాడుతూ.. కళాశాలలో పరిసరాలను పరిశుభ్రం చేసిన తర్వాతనే విద్యార్థులను తరగతి గదులలో కూర్చోబెట్టాలని కళాశాలల ప్రిన్సిపాల్లకు ఆదేశించారు.

October 6, 2025 / 08:27 AM IST

‘బీసీలకు అన్యాయం జరిగితే ఊరుకోం’

JN: బీసీలకు అన్యాయం జరిగితే ఊరుకోం అని బీసీ యువజన సంఘం జనగామ జిల్లా అధ్యక్షుడు పండుగ హరీష్ ముదిరాజ్ అన్నారు. జనగామలో ఆదివారం నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్‌ను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. రెడ్డి వర్గానికి చెందిన కొందరు నాయకులు కావాలనే ఇలా చేస్తున్నారు అన్నారు.

October 6, 2025 / 08:20 AM IST