NZB: రెంజల్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో శనివారం నాగుపాము దర్శనం ఇచ్చింది. కార్యాలయంలో పని చేస్తున్న ఓ ఉద్యోగి బాత్రూంకు వెళ్లగా అక్కడ పాము కనిపించడంతో ఉద్యోగులకు తెలిపారు. మిగతా ఉద్యోగులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. పాములు పట్టె వారికి సమాచారం ఇవ్వడంతో పామును పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేశారు.
HYD: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ మాజీ వైద్యాధికారి డాక్టర్ విజయ రావుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్స్ అప్రిసియేషన్ అవార్డు దక్కింది. గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో గత 2 రోజులుగా నిర్వహించిన 99వ ఆల్ ఇండియా మెడికల్ కాన్ఫరెన్స్ ఉత్సవ్ నాట్కాన్- 2024లో శనివారం ఈ అవార్డును అందజేశారు.
MDK: రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పాపన్నపేట మండలం నాగసన్ పల్లిలోని ఏడుపాయల దుర్గాభవాని క్షేత్రాన్ని ఆదివారం సందర్శిస్తారని కలెక్టర్ రాహుల్ రాజ్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. అమ్మవారి దర్శనం అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు. అధికారులు మంత్రి కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు.
HYD: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పేట్ బషీరాబాద్‌లోని ఓ స్కూల్లో 2వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా MLA మల్లారెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి వ్యక్తి విద్యార్థి దశ నుంచే అన్ని రంగాల్లో రాణించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆయన తెలిపారు. పిల్లలకు ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల ప్రోత్సాహం ముఖ్యం అని పేర్కొన్నారు.
MDK: కలెక్టరేట్లో మెదక్ నియోజకవర్గ అభివృద్ధిపై అదనపు కలెక్టర్ నగేష్, ముఖ్య ప్రణాళిక అధికారి, బద్రీనాథ్, EEPR నరసింహులు సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో కలిసి శనివారం MLC నియోజకవర్గ అభివృద్ధి నిధులపై సమావేశం నిర్వహించారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు అభివృద్ధి నిధులతో పటిష్ట ప్రణాళికలతో అహర్నిశలు కృషి చేస్తామన్నారు.
NZB: జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓగా జి. సాయన్న శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇది వరకు జిల్లా సీఈఓగా ఉన్న అధికారి ఉద్యోగ విరమణ చేయడంతో నందిపేట్ ఎండీఓకు ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పగించారు. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో డీఆర్డీఓగా విధులు నిర్వహిస్తున్న సాయన్న బదిలీపై నిజామాబాద్ జిల్లా పరిషత్‌కు వచ్చారు.
HYD: విద్యాశాఖ ఆకాంక్షలను అందుకోవడానికి ప్రధానోపాధ్యాయులు వారి అనుభవాన్ని జోడించి పనిచేయాల్సిన అవసరముందని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు పీవీ నరసింహారెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన పీఎం శ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమావేశంలో భాగంగా నిర్వహించిన ఓరియంటేషన్ ప్రోగ్రామ్‌కు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు.
KMM: జిల్లా ప్రజలకు సీపీ సునీల్ దత్ పలు సూచనలు చేశారు. సైబర్ నేరగాళ్ల మోసాలు అధికంగా పెరిగిపోయాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరైనా ఫోన్ చేసి డబ్బులు అడిగితే పంపి మోసపోవద్దన్నారు. ఎవరైనా డబ్బులు పంపాలని ఫోన్ చేస్తే వెంటనే 1930ను సంప్రదించాలని సీపీ కోరారు.
NZB: బోధన్ నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ కార్మికులు శనివారం హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ కోదండరాంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ కార్మికులకు రావాల్సిన వేతన బకాయిలు చెల్లించాలని కోరారు. వేతనాలు లేక కార్మికులు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జనరల్ సెక్రెటరీ ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.
ADB: గుడిహత్నూర్ మండలం రాగాపూర్ గ్రామపంచాయతీ చిన్నబొర్రమద్ది గ్రామంలో హైమాస్ట్ లైట్స్ ఏర్పాటు చేయాలని గ్రామస్థులు ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను కోరారు. ఈ మేరకు స్పందించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గ్రామంలో హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయించారు. స్థానికులు శనివారం రాత్రి ప్రారంభించారు. గ్రామస్థులు ఎమ్మెల్యే అనిల్ జాదవుకు కృతజ్ఞతలు తెలిపారు.
NZB: మోర్తాడ్ మండల కేంద్రంలో సీజ్ చేసిన ఇసుక సోమవారం వేలం నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ సత్యనారాయణ తెలిపారు. అనుమతి లేకుండా అక్రమంగా నిల్వ చేసిన 64 ఇసుక కుప్పలను ఏడీ మైన్స్ నిజామాబాద్ సిబ్బందితో కలిసి మండల రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. సీజ్ చేసిన ఇసుకను సోమవారం వేలం వేయనున్నట్లు తహసీల్దార్ సత్యనారాయణ వివరించారు.
SDPT: చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాలిలా..అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పోకల నర్సింలు(43)గ్రామంలోని ఊర చేరువులో చేపలు పట్టాడానికి వెళ్లి ఇంటికి రాకపోయే సరికి, గాలిస్తుండగా చెరువులో మృతదేహం లభ్యమైంది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
జనగాం: జనగామ మండలం చౌడారంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం, సఖి కేంద్రం ఆధ్వర్యంలో హెల్ప్ లైన్ నంబర్లపై అవగాహన కల్పించారు. మహిళలు ఎక్కడైనా హింసకు గురైతే 181, బాల్య వివాహాలు అరికట్టడానికి 1098 నంబర్లను సంప్రదించాలంటూ విద్యార్థులతో మానవహారం చేపట్టారు.
NZB: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్మూర్ డిపో అరుణాచల గిరిప్రదక్షణ యాత్రకు బస్సు సర్వీసును ప్రారంభించింది. జనవరి 4 శనివారం ఆర్మూర్ డిపో నుంచి మధ్యాహ్నం 3.00 గంటలకు బయలుదేరనుంది. అరుణాచలం, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, జోగులాంబకు సర్వీసును వినియోగించుకోవాలని ఆర్మూర్ ఆర్టీసీ డిపో మేనేజర్ మోహన్ తెలిపారు.
ADB: ఉట్నూర్‌లోని యూత్ ట్రైనింగ్ సెంటర్లో శనివారం జాబ్ మేళా నిర్వహించారు. ఈసందర్భంగా జాబ్ మేళాను ప్రారంభించిన ఉట్నూర్ ఐటీడీఎ ప్రాజెక్టు అధికారి ఖుష్బూ గుప్తా మాట్లాడుతూ.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ యువత ఉన్నతంగా ఎదగాలన్నారు. కాగా జాబ్ మేళాకు జిల్లా నుంచి 516 మంది నిరుద్యోగులు హాజరయ్యారు.