KMR: బాన్సువాడలో ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా ప్రశాంతంగా ఉందని, ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని SP రాజేశ్ చంద్ర స్పష్టం చేశారు. నిన్న జరిగిన సంఘటనపై పోలీసులు ఇప్పటికే కేసులు నమోదు చేసి, లోతైన దర్యాప్తు జరుపుతున్నారన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని SP పేర్కొన్నారు.
SRPT: నడిగూడెం మండలం కేశవపురంలో ఇంటి పన్నుతో పాటు గ్రంథాలయ పన్ను వసూలు చేస్తున్న అధికారులు వసతుల కల్పనలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారని బీజేపీ నాయకులు, నిరుద్యోగులు ఆరోపించారు. కనీసం దినపత్రికలు కూడా లేకపోవడంతో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. వెంటనే గ్రంథాలయంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని వారు కోరుతున్నారు.
NLG: నల్గొండ మండలంలోని రాములబండ శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి మార్చి మూడవ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఇవాళ తోరణం, 22న అధ్యయన ఉత్సవాలు, 23న పరమపదోత్సవం, మార్చి 1న రథయాత్ర జరుగుతుందని ఆలయ కమిటీ వివరించింది. భక్తులు పాల్గొని ఆ స్వామి వారిని దర్శించుకోవాలని కోరారు.
MBNR: రాజాపూర్ మండలం చెన్నవల్లి గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి పిట్టల శ్రీకాంత్ (25) అనే యువకుడు మృతి చెందాడు. తన ఇంటి బాత్రూంపై తెగిపడిన విద్యుత్ వైరు సరిచేస్తుండగా బలమైన షాక్ తగిలింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే MBNR ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
WGL: తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో వరంగల్ కమిషనరేట్ ఏసీపీలు సత్తా చాటారు. 55 ఏళ్ల గెజిటెడ్ అధికారుల బ్యాడ్మింటన్ విభాగంలో ఏసీపీలు జితేందర్ రెడ్డి, మధుసూదన్‌ల జోడీ అద్భుత ప్రదర్శనతో బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. అద్భుతమైన ఆటతీరుతో వారు బంగారు పతకం సొంతం చేసుకోగా శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి.
NZB: ధర్పల్లి మడల కేంద్రంలో పంపిణీ చేసిన 48 డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మౌలిక వసతుల కొరత వేధిస్తోంది. రెండు నెలల క్రితం ఇళ్లు కేటాయించగా, ఇటీవల గృహప్రవేశం చేసిన లబ్ధిదారులకు తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి నీళ్లు తెచ్చుకోవాల్సి వస్తోందని, అధికారులు వెంటనే స్పందించి వసతులు కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
MDK: జిల్లాలోని మీడియా ప్రతినిధులకు 2026-28 సంవత్సరాలకు కొత్త అక్రిడిటేషన్‌ల జారీ కోసం నూతన జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ (DMAC) ఏర్పాటుకు చర్యలు ప్రారంభించినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. సంఘాలు తమ ప్రతినిధి పేరును లెటర్ ప్యాడ్‌పై రాసి ఈనెల 23న ఉదయం 11 గంటలలోపు అందజేయాలని సూచించారు.
JGL: కోరుట్ల పట్టణ శివారు డీ- 40 కెనాల్ సమీపంలోని ఓ వ్యవసాయ బావిలో ఓ మృతదేహం లభించింది. ఆ మృతదేహం మేడిపల్లి మండలం కంట్లకుంట గ్రామానికి చెందిన గుండంపల్లి శంకర్‌గా పోలీసులు గుర్తించారు. కాగా శంకర్ ఈ నెల 13న మెట్‌పల్లిలో అత్తగారింటికి వెళ్తానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరి రాలేదని, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై చిరంజీవి తెలిపారు.
SRPT: గరిడేపల్లి మండలం పొనుగోడులో ఇవాళ అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ సుందర్ కిరణ్ కుమార్ (మాజీ DRDA PD) నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో ఆయన స్వగృహం, కార్యాలయాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియల్సి ఉంది.
మహబూబ్ నగర్లో DDU-GKY & స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ద్వారా నిరుద్యోగ యువతులకు నర్సింగ్ అసిస్టెంట్ కోర్సులో ఉచిత శిక్షణ అందిస్తున్నారని కో-ఆర్డినేటర్ రవికుమార్ తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులు. ఎంపికైన వారికి ఉచిత శిక్షణ, వసతి, భోజన సదుపాయం కల్పిస్తారు. దరఖాస్తులు ఈ నెల 23వ తేదీకి ముందే చేయాలని, 9949698592లో సంప్రదించాలని ఆయన సూచించారు.
HNK: హోలీ పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైలు సర్వీసులను ప్రకటించింది. కాజీపేట జంక్షన్ మీదుగా చర్లపల్లి-దానాపూర్ మార్గంలో మొత్తం 12 ప్రత్యేక రైళ్లను ఫిబ్రవరి 23, 25, 27, 28, మార్చి 1, 3, 5, 7, 9వ తేదీల్లో నడవనున్నాయి. ఈ రైళ్లలో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్, జనరల్ ఉన్నాయి.
ASF: బెజ్జూర్ మండలం రెబ్బెనలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద రూ.10 లక్షల అంచనాతో మంజూరైన మహిళా సమాఖ్య భవనానికి MLA హరీష్ బాబు శనివారం శంకుస్థాపన చేశారు. MLA మాట్లాడుతూ.. ప్రతి గ్రామపంచాయతీకి మహిళా సమాఖ్య భవనం, ప్రతి మండలంలో రూ.30 లక్షల అంచనాతో గిడ్డంగి నిర్మాణం చేపట్టనున్నామని తెలిపారు. సర్పంచ్ నందిపేట రాజయ్య, మహిళా సమాఖ్య సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
ADB: ఆదిలాబాద్ మున్సిపల్ ఛైర్మన్‌గా బండారి అనూష శనివారం ఆమె కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. మొదటగా వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆమెకు ఆశీర్వచనాలు అందజేశారు. బాధ్యతలు చేపట్టిన ఆమెకు వైస్ ఛైర్మన్ రోహిత్, కాంగ్రెస్ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి, గండ్రత్ సుజాత శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
SRPT: హుజూర్ నగర్ పట్టణంలోని స్థానిక మండల ప్రజా పరిషత్ (MPP) కార్యాలయ ఆవరణలోని జాతీయ జెండా దిమ్మెను గుర్తుతెలియని ఆగంతుకులు ధ్వంసం చేశారు. శనివారం ఉదయం ఈ విషయాన్ని గమనించిన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణంలోనే ఈ ఘటన జరగడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.
RR: షాద్‌నగర్ పట్టణంలోని 23వ వార్డు మైసమ్మ దేవాలయంలో నూతన ఛైర్మన్ బసవేశ్వర్, వైస్ ఛైర్మన్ అందేమోహన్, కౌన్సిలర్లు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా సాయి మిత్ర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షులు సత్యనారాయణ వారికి అభినందనలు తెలిపారు. వారు మాట్లాడుతూ.. నూతన పాలకవర్గం సమస్యలను పరిష్కరిస్తారని ప్రజలు భావిస్తున్నారన్నారు.