BDK: అశ్వాపురం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రారంభమయ్యాయి. పరీక్షా కేంద్రం వద్ద సిఐ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయగా, విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే కేంద్రాల్లోకి అనుమతించారు.
GDWL: మున్నూరు కాపు సంఘం జిల్లా కమిటీ కాలపరిమితి ముగియడంతో జిల్లా అధ్యక్షుడు జి.వేణుగోపాల్ రాజీనామా చేశారు. తాత్కాలిక అధ్యక్షుడిగా కాపులకుంట సుధాకర్ రెడ్డి నియమితులయ్యారు. గౌరవాధ్యక్షుడు బాణాల కృష్ణమూర్తిని కలిసారు. సంఘ బలోపేతానికి కృషి చేసి, త్వరలో నూతన కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు.
WGL: నగరంలోని ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షా కేంద్రానికి ఓ దివ్యాంగ విద్యార్థి ఐదు నిమిషాల ఆలస్యంగా చేరుకున్నాడు. నిబంధనల ప్రకారం పోలీసులు మొదట అతడిని లోపలికి అనుమతించలేదు. ఆ విద్యార్థి పడుతున్న ఇబ్బందిని గమనించిన పరీక్షా కేంద్ర నిర్వాహకులు మానవత్వంతో స్పందించారు. దివ్యాంగులైన విద్యార్థులకు నిబంధనల మేరకు కొంత సమయం మినహాయింపు ఉంటుందని ఆలస్యమైనా అతడిని పరీక్ష రాసేందుకు అనుమతించారు.
KMM: మహిళలు, యువతులే లక్ష్యంగా సాగుతున్న సైబర్ ట్రాఫికింగ్ పై అంగన్వాడీ టీచర్లు సమాజంలో అవగాహన కల్పించాలని ఖమ్మం జిల్లా సంక్షేమ అధికారి విజేత పిలుపునిచ్చారు. ‘ప్రజ్వల’ సంస్థ, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నుంచి రెండు రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రేమ ఉద్యోగాల పేరుతో సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.
KMM: జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ శ్రీజ ఆదేశించారు. మంగళవారం డీఈఓ చైతన్య జైనీతో కలిసి ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు తాగునీరు వంటి కనీస వసతులు కల్పించాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
WNP: పెబ్బేరు మండలం బూడిదపాడు గ్రామంలో పోలీస్ పెట్రోలింగ్ చేస్తుండగా బూడిదపాడు వాగులో నుంచి 2 ఇసుక ట్రాక్టర్లు బయటకు రావడం జరిగింది. వాటి పర్మిషన్ అడగగా ఎలాంటి అనుమతులు లేవని చెప్పడంతో అట్టి ట్రాక్టర్లను,డ్రైవర్ వెంకటయ్య,శేఖర్ అనే 2 వ్యక్తుల పైనా కేసు నమోదు చేశారు.స్టేషన్కు తీసుకొచ్చి కేసు నమోదు చేసి అట్టి రెండు ఇసుక ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు.
SRCL: రుద్రంగి మండల కేంద్రానికి చెందిన సింగారపు బాబుకు అంతర్జాతీయ పారా వాలీబాల్ కోచ్ అరుదైన గౌరవం దక్కింది. జపాన్‌లోని ఐచి-నగోయాలో జరగనున్న 2026 ఆసియా పారా గేమ్స్ కోసం భారత జట్టును ఎంపిక చేసే సాంకేతిక పరిశీలకులు, ఎంపిక కమిటీ సభ్యుడిగా పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా ఆయన్ను నామినేట్ చేసింది.
నల్లగొండ: జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ఈఓ రాజశేఖర్ మాట్లాడుతూ.. గ్రామాల్లో ఏర్పాటు చేసే ఉచిత పశువైద్య శిబిరాలను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మంగళవారం కట్టంగూర్ మండలంలోని భాస్కరబాయి గ్రామంలో పశు సంవర్ధక శాఖ, పశు గణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత పశు వైద్య శిబిరాన్ని పరిశీలించారు.
PDPL: రామగుండం సింగరేణి 11వ బొగ్గు గనిలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఐలయ్య అనే కోల్ కట్టర్ తీవ్రంగా గాయపడ్డారు. గనిలో బ్లాస్టింగ్ అనంతరం అకస్మాత్తుగా సైడ్ ఫాల్ (బొగ్గు పెల్లలు) పడడంతో ఆయన నడుము, కుడి కాలుకు గాయాలయ్యాయి. బాధితుడిని జీడీకే సింగరేణి ఆసుపత్రికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు.
HYD: హైదరాబాద్ జిల్లాలో పాలిటెక్నిక్ విద్యార్థులకు గత మూడు సంవత్సరాల స్కాలర్షిప్‌లు అందకపోవడంతో వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెల రూ.750 చొప్పున 10 నెలలకు రూ.7,500 ఇవ్వాల్సి ఉండగా నిధులు విడుదల కాలేదని తెలిపారు. పెండింగ్ మొత్తాన్ని వెంటనే చెల్లించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
SRPT: విద్యుదాఘాతంతో గేదె మృతిచెందిన ఘటన చిలుకూరు మండలంలోని జెర్రిపోతులగూడెం గ్రామంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బేతు సోమయ్య చారికి చెందిన గేదెను ఇంటి నుంచి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలోకి తీసుకెళ్తుండగా పక్కనే ఉన్న ట్రాన్స్ ఫార్మర్ తీగ తగిలి గేదె అక్కడిక క్కడే మృతిచెందింది.
HYD నగరానికి జంట జలాశయాలు మంచినీటి వరప్రదాయినిగా నిలుస్తున్నాయి. 1920 ప్రాంతంలో ఉస్మాన్ సాగర్ నుంచి ఆసిఫ్ నగర్ వరకు సుమారు 16 కిలోమీటర్ల పైప్ లైన్ నిర్మించారు. కాలక్రమేణా మరమ్మత్తులు పెరగడంతో లీకేజీలు అధికమవుతున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రూ.280 కోట్ల వ్యయంతో కొత్త పైప్ లైన్ ఏర్పాటు చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది.
KNR: అసంపూర్తిగా నిలిచిపోయిన డీ-8 ఉప కాలువ నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేసి నీటిని అందించాలని కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారం గ్రామ రైతులు డిమాండ్ చేశారు. మంగళవారం బాధిత రైతులు తహసీల్దార్ కనకయ్యకు వినతి పత్రం అందజేశారు. కాలువ నిర్మాణంలో భూములు కోల్పోయి నష్టపోయామన్నారు. కాలువ నిర్మాణం పూర్తిస్థాయిలో జరగక పంటలకు నీరు అందడం లేదని, అన్నారు.
MBNR: కార్పొరేషన్ పరిధిలోని 21వ డివిజన్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని డివిజన్ కార్పొరేటర్ గూండా సంతోష్ అన్నారు. మంగళవారం రాత్రి డివిజన్‌కు సంబంధించిన నాయి బ్రాహ్మణ కాలనీ ప్రజలు కార్పొరేటర్‌ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనను నమ్మి ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు.
ADB: ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంలో గ్రామ పాలన అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నారని అదనపు కలెక్టర్ శ్యామల దేవి తెలిపారు. మంగళవారం పట్టణంలోని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జీపీఓ, ఆర్‌ఐ యాప్‌పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్థాయిలో ఆదాయం, నివాసం తదితర ధ్రువపత్రాలను జీపీఓల ద్వారా జారీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.