మహబూబ్‌నగర్ నియోజకవర్గం కొండారెడ్డిపల్లిలో జరుగుతున్న ఉమారామలింగేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో ఎంపీ డీకే అరుణ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు బైరా ఖాన్ పల్లిలోని శ్రీ స్వయంభు లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో కూడా ఆమె పాల్గొన్నారు. స్వామివారి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఈ సందర్భంగా ఆమె ఆకాంక్షించారు.
ADB: ఈరోజు నుంచి 31 వరకు జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలియజేశారు. జిల్లా పోలీస్ యంత్రాంగం ముందస్తు అనుమతులు లేకుండా ప్రజా బహిరంగ కార్యక్రమాలు, సభలు, ర్యాలీలు నిషేధించినట్లు పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.
SDPT: కొండపాక వద్ద కారు, డీసీఎం వ్యాన్ ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో భార్యా భర్తలు ప్రాణాలు కోల్పోయారు. సింగరేణి ఉద్యోగి అబ్దుల్ రఫీ ఘటనా స్థలంలోనే మృతి చెందగా, ఆయన భార్య మల్దూర్ బేగం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. రోడ్డు మరమ్మతుల వల్ల వన్వే అమలులో ఉన్నందున వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
NLG: చిట్యాలలోని జాతీయ రహదారిపై గత కొన్ని రోజులుగా వీధి దీపాలు వెలగకపోవడంతో చీకటి అలుముకుంది. ఎస్‌బీహెచ్ యూటర్ను నుంచి రైల్వే స్టేషన్ యూటర్న్ వరకు లైట్లు పనిచేయడం లేదు. రహదారి పనుల కారణంగా కనెక్షన్లు తొలగించడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. డివైడర్ మధ్యలో లైట్లు లేక సర్వీస్ రోడ్డు ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నిజామాబాద్ మీదుగా వెళ్లే పలు రైళ్లు నిర్వహణ పనుల కారణంగా పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే (SCR) అధికారులు నేడు ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి 7వ తేదీ వరకు రద్దు చేశారు. కాచిగూడ – నిజామాబాద్ (77601), నిజామాబాద్ – కాచిగూడ (77602), నిజామాబాద్ – నాందేడ్ (77645), నాందేడ్ – నిజామాబాద్ (77646) రైళ్లు రద్దయ్యాయి.
WGL: జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఫిర్యాదు పెట్టెల ద్వారా విద్యార్థుల సమస్యలు త్వరగా పరిష్కారమవుతున్నాయని జిల్లా డా. కలెక్టర్ సత్య శారద తెలిపారు. WGL కలెక్టర్ కార్యాలయంలో శనివారం రాత్రి ఫిర్యాదులు పెట్టెలో వచ్చిన ఫిర్యాదులను కలెక్టర్ స్వయంగా చదివారు. విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.
ASF: తెలంగాణ మెడికల్ కాంట్రాక్టు ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గోలేటికి చెందిన భోగే ఉపేందర్ ఎన్నికయ్యారు. వరంగల్‌లో జరిగిన రాష్ట్ర 4వ మహాసభలో ఈ ఎన్నిక జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎం. నరసింహ ప్రకటనలో తెలిపారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
KNR: స్థానిక SRR ప్రభుత్వ కళాశాలలో సర్టిఫికేట్ కోర్సు ఇన్ జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్ కోర్సు 27వ బ్యాచ్ 6 నెలలపాటు జరిగింది. ఇందులో భాగంగా రెండు రోజులపాటు విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. శనివారం జర్నలిజం పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని కోర్సు కో ఆర్డినేటర్, తెలుగు విభాగం అధ్యక్షులు, అసోసియేట్ ప్రొఫెసర్ బి. చంద్రశేఖర్ తెలిపారు.
MNCL: కార్పొరేషన్ అభివృద్ధిలో కార్పొరేటర్లు, అధికారులు రాజీ పడవద్దని MLA ప్రేమ్ సాగర్ రావు సూచించారు. మంచిర్యాల మున్సిపల్ కార్యాలయం ఆవరణలో డివిజన్ల ఆఫీసర్లతో సమావేశం జరిగింది. ప్రతి ఇంటిని తమ ఇంటిగా భావించి సమస్యల పరిష్కారానికి ఆయా డివిజన్ల అధికారులు బాధ్యత వహించాలని అన్నారు. మేయర్ ధరణి మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేశ్, అధికారులు పాల్గొన్నారు.
GDWL: విద్యార్థులు సైన్స్‌లో నూతన ఒరవడి సృష్టించాలని అయిజ ఎంఈవో రాములు దయాల్ పేర్కొన్నారు. నేషనల్ సైన్స్ డే ను పురస్కరించుకొని శనివారం పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ డే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విద్యార్థులు తయారుచేసిన ఆవిష్కరణలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సైన్స్ పట్ల ఆసక్తి పెంచుకోవాలని విద్యార్థులకు సూచించారు.
SRCL: వీర్నపల్లి మండలం గర్జనపల్లిలో ప్రమాదకర ఘటన చోటుచేసుకుంది. పొలంలో పెట్టిన నాటు బాంబు పేలడంతో మేతకు వెళ్లిన పాడి గేదె తీవ్రంగా గాయపడింది. భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో గ్రామస్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. గాయపడిన గేదెకు పశువైద్యులు చికిత్స అందిస్తున్నారు. అడవి జంతువుల కోసం ఏర్పాటు చేసిన నాటు బాంబు కావచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ADB: ప్రభుత్వ సర్వీసులో సుదీర్ఘ కాలం పాటు నిబద్ధతతో పనిచేసి, ప్రజలకు సేవలందించడం అభినందనీయమని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శనివారం అదనపు కలెక్టర్ శ్యామలాదేవి పదవీ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పదవీ విరమణ అనేది కేవలం విధులకు మాత్రమేనని, సమాజ సేవలో ఆమె అనుభవం ఎంతో అవసరమని పేర్కొన్నారు.
NRML: చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు స్థానాచార్యులు ప్రవీణ్ పాఠక్ తెలిపారు. ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ ఉప ఆలయాలను కూడా మూసివేస్తామన్నారు. మంగళవారం తెల్లవారుజామునే అమ్మవార్లకు అభిషేకాలు, అర్చనలు, నివేదనలు పూర్తి చేసి, ఉదయం 7 గంటలకు ఆలయ ద్వారాలను మూసివేస్తామని వివరించారు.
SRCL: వేములవాడ నియోజకవర్గ పరిధిలోని వరద కాల్వకు అధికారులు రాంపూర్ పంపు హౌస్ నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా రెండవ, మూడవ మోటార్లు ఆన్ చేసి వరద కాల్వకు నీటిని విడుదల చేశారు. కాగా నిన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి వేములవాడ నియోజకవర్గనికి నీటిని విడుదల చేయాలని కోరారు. వెంటనే మంత్రి నీటిని విడుదల చేయవలసిందిగా ఆదేశించారు.
JGL: జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆత్మీయ వాతావరణం నెలకొంది. 36 ఏళ్లపాటు పోలీస్ శాఖలో నిబద్ధతతో సేవలందించిన ఏఎస్ఐ బిక్షపతి ఉద్యోగ విరమణ పొందారు. ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ పూలమాల వేసి, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఆయన సేవలను కొనియాడుతూ.. శాఖకు చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. ఉద్యోగ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలన్నారు.