NLG: ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టినట్లు ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్ తెలిపారు. చిట్యాలలో బుధవారం జరిగిన సీపీఎం మండల కమిటీ సమావేశంలో… మండలంలోని వివిధ గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై బృందం అధ్యయనం చేసి పోరాట కార్యక్రమాన్ని రూపొందిస్తుందని తెలిపారు.
ASF: తమ భూమిలో సాగు చేసుకోనియకుండా అటవీ అధికారులు అడ్డంకులు సృష్టిస్తున్నారని సిర్పూర్(T) మండలం అచ్చేల్లి గ్రామస్థులు ఆరోపించారు. గత 40 ఏళ్లుగా 136 సర్వే నెం.లో సాగు చేసుకుంటున్న తమ భూమి అటవీ పరిధిలో వస్తుందని అధికారులు అబద్దాలు చెబుతున్నారన్నారు. ఈ మేరకు ఇట్టి భూములపై జాయింట్ సర్వే చేసి తమకు న్యాయం చేయాలని బుధవారం MRO కి వినతిపత్రం అందజేశారు.
ASF: కాగజ్ నగర్ మండలం కోయవాగు అంగన్వాడీ కేంద్రాన్ని సర్పంచ్ చింతపురి లక్ష్మి బుధవారం సందర్శించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిన్నారులకు అందించే పోషకాహారం నాణ్యంగా ఉండాలని, పంపిణీలో ఎటువంటి లోపాలు ఉండకూడదని సిబ్బందిని ఆదేశించారు. గ్రామంలోని చిన్నారులందరూ కేంద్రానికి వచ్చేలా చూడాలని, వారి ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
SRCL: ఇల్లంతకుంట మండల కేంద్రంలో LM–6 కాల్వ పనుల కోసం 16వ రోజు దీక్ష కొనసాగిస్తున్న బాధిత రైతులు బుధవారం బిక్షాటనకు దిగారు. పెద్దలింగపూర్ నుంచి ట్రాక్టర్లపై వచ్చిన రైతులు, సర్పంచులు, మహిళలు దుకాణదారుల వద్ద సహాయం కోరారు. కాల్వ పూర్తి చేయడానికి రూ.3.20 కోట్లు అవసరమని, నిధులు విడుదలయ్యే వరకు పోరాటం ఆపబోమని వారు స్పష్టం చేశారు.
PDPL: పెద్దపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యమని ఎమ్మెల్యే విజయరమణరావు అన్నారు. ప్రజాసేవకు ఆకర్షితులై జూలపల్లి మండలం కాచాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు 100 మందికి పైగా బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. శివపల్లిలోని ఎమ్మెల్యే నివాసంలో జరిగిన వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
MHBD: తొర్రూరు పట్టణంలో తమ అధికారిక కార్యక్రమాలు ముగించుకుని బుధవారం పాలకుర్తి వైపు ప్రయాణిస్తుండగా వెలికట్టే గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదాన్ని గమనించారు. ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న దంపతులు కిందపడడంతో గాయాలపాలయ్యారు. వెంటనే వాహనం ఆపించి సంఘటనా స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే యశస్విని గాయపడిన వారిని పరామర్శించి, వారిని ఆసుపత్రికి తరలించారు.
MDCL: మేడ్చల్ సర్కిల్ పరిధిలో నీటి ట్యాంకర్లకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో రోజుకు దాదాపు 15 ట్యాంకర్ల వరకు సరఫరా జరుగుతున్నట్లు సమాచారం. ఒక్కో ట్యాంకర్‌కు రూ.600 నుంచి రూ.1000 వరకు వసూలు చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. వేసవి తీవ్రత పెరగడంతో భూగర్భజలాల కొరత స్పష్టమవుతోంది.
RR: కుమ్మెర మల్లన్న జాతరలో మృతి చెందిన రెండు నెలల పసిపాప కుటుంబాన్ని షాద్‌నగర్ నియోజకవర్గం నందిగామ మండల రజక సంఘం నేతలు కలిసి మద్దతు తెలుపుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిందితులకు కఠిన శిక్ష అమలు చేయాలని, బాధితులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో శివశంకర్, బాల్ రాజ్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
HNK: ESI ఆసుపత్రిని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాకు త్వరలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, మెగా టెక్స్టైల్ పార్క్, విమానాశ్రయం వంటి మూడు ప్రధాన ప్రాజెక్టులు రానున్న నేపథ్యంలో కార్మికుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని, ఆసుపత్రిలో పేషెంట్లకు నాణ్యమైన సేవలను అందించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డాక్టర్లకు ఎంపీ సూచించారు.
BDK: మణుగూరు పీవీ కాలనీలో నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 11వ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఇవాళ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజల సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ప్రాంత అభివృద్ధి కోసం ప్రార్థనలు చేసినట్లు తెలిపారు.
MDK: సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తూప్రాన్ సీఐ రంగా కృష్ణ సూచించారు. వెల్దుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అపరిచిత వ్యక్తులు పంపిన మెసేజ్, లింకులను ఓపెన్ చేయొద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ADB: ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు మార్చి 28న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తెలిపారు. పెండింగ్ కేసులను అధికంగా పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు. రానున్న లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ మేరకు ఆయన సమన్వయ సమావేశంలో పలు సూచనలు చేశారు.
WGL: నెక్కొండ మండలం పెద్దకోర్పోల్ గ్రామానికి చెందిన మట్టే ఏలియా అనే వ్యక్తి విద్యుత్ షాక్‌తో ప్రమాదవశాత్తు మృతి చెందాడు. బుధవారం మధ్యాహ్నం వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లిన ఏలీయా.. విద్యుత్ ప్రమాదానికి గురై మృతిచెందాడు. దీంతో పెద్దకోర్పోల్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఏలీయా కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.
SRPT: సమాజసేవలో ఎన్జీవోలు ముందుండాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. HCL Foundation విరాళంగా అందించిన ఆధునిక వైద్య పరికరాలను సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి అందజేశారు. పేదలకు మెరుగైన వైద్యం అందించడంలో ఈ పరికరాలు ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు, ఎన్జీవో ప్రతినిధులు పాల్గొన్నారు.
JN: జాతీయ రహదారి నిర్మాణంలో ఇళ్ల ప్లాట్లు కోల్పోతున్న ప్లాట్ల యజమానులకు నష్టపరిహారం చెల్లించి రోడ్డు పనులను చేపట్టాలని CPM జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి అన్నారు. జనగామలో బాధిత ఫ్లాట్ల యజమానులు చేపట్టిన రిలే నిరాహార దీక్షకు కనకారెడ్డి మద్దతు తెలిపారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.