KMR: ఎల్లారెడ్డి ఎక్సైజ్ కార్యాలయంలో బుధవారం తుప్పు పట్టిన 5 వాహనాలకు నిర్వహించిన వేలంలో 10వేల రూపాయల ఆదాయం వచ్చిందని స్థానిక ఎక్సైజ్ సీఐ ఎండి. షాకీర్ అహ్మద్ తెలిపారు. కామారెడ్డి ఎక్సైజ్ సూపరింటెండెంట్ బీ. హనుమంతరావు ఆదేశాల మేరకు గత 12సంవత్సరాల క్రితం NDPS కింద పట్టుబడిన 5 తుప్పు పట్టిన వాహనాలకు వేలం నిర్వహించడం జరిగింది.
KMM: భూదానం భూములపై సమగ్ర విచారణ ప్రక్రియ చేపట్టినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం వెల్లడించారు. నిజంగా నిరుపేదలే ఉన్నారా లేదా అని అంశంపై రెవెన్యూ శాఖ అధికారులు గ్రామస్థాయిలో సర్వే నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. డబ్బులు వసూలు చేసి ప్లాట్లు విక్రయించిన వ్యక్తులపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.
MHBD: మహబూబాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం 15 మంది లబ్దిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీ నాయక్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు. లబ్దిదారులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
MLG: మండలం జంగాలపల్లి గ్రామానికి చెందిన తూముల అనిల్ నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర మంత్రి సీతక్క బుధవారం సాయంత్రం మృతుడి నివాసానికి వెళ్లి ఆయన పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.
MHBD: తొర్రూరు మండలంలోని వెలికట్టే గ్రామానికి చెందిన ముక్కెర యాకన్న ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. చరిత్ర విభాగంలో “ల్యాండ్ కాస్ట్ అండ్ పవర్ ఆఫ్ తెలంగాణ” అంశంపై డాక్టర్ అంజయ్య పర్యవేక్షణలో పరిశోధన చేసినందుకు గాను యూనివర్సిటీ విభాగం గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా యాకన్నను పలువురు అభినందించారు.
WGL: నెక్కొండ మండలం మడిపల్లి గ్రామపంచాయతీ నిధుల దుర్వినియోగం పై గ్రామ సర్పంచ్ అనూష DLPOకు బుధవారం ఫిర్యాదు చేశారు. 15వ ఫైనాన్స్ కమిషన్ నిధుల్లో రూ. 1,75,703 అక్రమంగా విడుదల చేసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పాలకవర్గం, తనకు తెలియకుండా ఫిబ్రవరి 21న హాజరు పట్టికలో సంతకం పేరుతో కార్యదర్శి రజియా మోసం చేసినట్లు సర్పంచ్ ఆరోపించారు.
MHBD: మహబూబాబాద్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో బుధవారం ప్రయాణికుడి వద్ద నుంచి రూ. 7 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు అపహరించిన ఘటన చోటుచేసుకుంది. మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామానికి చెందిన గండి శోభన్, మంజుల దంపతులు నర్సంపేట వెళ్లే బస్సు కోసం వేచి చూస్తుండగా దొంగలు బ్యాగ్‌ను ఎత్తుకెళ్లారు. ఫిర్యాదు మేరకు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
JN: ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి పార్టీ శ్రేణులు విస్తృతంగా తీసుకెళ్లాలని TPCC వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీరెడ్డి అన్నారు. కొడకండ్ల మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సర్పంచులతో వైస్ ప్రెసిడెంట్ సమావేశమయ్యారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని, గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.
KMM: వెలుగుమట్ల గ్రామ సర్వే నం. 147,148,149 భూములపై జిల్లా యంత్రాంగం చేపట్టిన కూల్చివేతలు, స్వాధీన చర్యలు పూర్తిగా చట్టబద్ధమైన వని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఇవాళ తెలిపారు. 31 ఎకరాల 7 గుంటల భూదాన్ భూమి ఆక్రమణలో ఉండగా, సంబంధిత భూమి మొత్తం విలువ సుమారు 250 కోట్లకు పైగా ఉంటుందని భారీ స్థాయి ఆస్తులను కాపాడగలిగామని ఆయన తెలిపారు.
NZB: ఆహార భద్రతా నియమాలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నవిత హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్ ప్రాంతంలో పలు ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లను హోటళ్లను బుధవారం తనిఖీ చేశారు. పలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో టేస్టింగ్ సాల్ట్ కృత్రిమ రంగులవాడుతున్నట్లు గమనించామన్నారు.
PDPL: గోదావరిఖని పట్టణంలో బుధవారం ఆర్ఎంపీ డాక్టర్ల మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా జవహర్ నగర్‌కు చెందిన ఆర్ఎంపీ వైద్యుడు అన్వర్ ఇటీవల ఒక వ్యక్తికి సీపీఆర్ చేసి ఆయన ప్రాణాలు కాపాడారు. ఈ సందర్భంగా సదరు RMP వైద్యుడిని నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ ఎల్లయ్య యాదవ్ శాలువా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో 54వ డివిజన్ కార్పోరేటర్ ముస్తఫా పాల్గొన్నారు.
SRCL: రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులకు బంగారు పతకాలు లభించాయి. సైబరాబాద్ కమిషనరేట్ వేదికగా ఫిబ్రవరి 16 నుండి 21 తేదీ వరకు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర 4వ పోలీస్ స్పోర్ట్స్ మీట్లో జిల్లా పోలీసు క్రీడాకారులు విశేష ప్రతిభ కనబరిచారు. మొత్తం 8 పతకాలు (4-బంగారు, 4-కాంస్య) సాధించడం పట్ల బుధవారం జిల్లా ఎస్పీ మహేష్ అభినందించారు.
ADB: భీంపూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ను ఆదిలాబాద్ SP అఖిల్ మహాజన్ బుధవారం సందర్శించారు. స్టేషన్‌కు వచ్చిన ఆయనకు పోలీస్ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. మహారాష్ట్ర సరిహద్దుతో ఉన్నందున ఆసాంఘిక కార్యకలాపాలు, అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తూ ప్రమాదాల నివారణకు కృషి చేయాలని సూచించారు.
BDK: మణుగూరు పగిడేరు గ్రామంలో వేల్పుల శ్రీరాములు సుమలత దంపతుల కుమార్తె ప్రతానం వేడుకలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వధువును ఆశీర్వదించి, ఆమె భవిష్యత్తు సుఖశాంతులతో నిండాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ముచ్చటించి శుభాకాంక్షలు తెలిపారు. సంప్రదాయ పద్ధతిలో నిర్వహించిన ఈ వేడుక ఆనందోత్సాహాల మధ్య జరిగింది.
NRPT: గ్రామాల అభివృద్ధికి సర్పంచులు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. నారాయణపేట నైపుణ్య అభివృద్ధి కేంద్రంలో కొనసాగుతున్న సర్పంచుల శిక్షణ తరగతుల శిబిరాన్ని బుధవారం ఎస్పీ డాక్టర్ వినీత్తో కలిసి సందర్శించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలు మెచ్చేలా పరిపాలన అందించాలని చెప్పారు. వీధి దీపాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.