»Man Arrested For Stealing Old People Land With Fake Documents At Warangal Rangashaipet
Fake Documents: ఫేక్ పత్రాలతో వృద్ధుల భూమిని కొట్టేసిన వ్యక్తి అరెస్టు
ఫేక్ డాక్యుమెంట్లతో వృద్ధదంపతులను మోసం చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వారికి న్యాయం జరిగేలా చేశారు. ఈ సంఘటన వరంగల్ జిల్లాలోని రంగశాయపేట(rangashaipet warangal)లో ఇటీవల చోటుచేసుకుంది.
నకిలీ పత్రాలు(Fake Documents) సృష్టించి వృద్ధ దంపతుల భూమిని కబ్జా చేశారన్న ఆరోపణలపై గడ్డం యుగంధర్ అనే వ్యాపారిని టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్టు చేసి అతని నుంచి రూ.13 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ జిల్లాలోని రంగశాయపేట(warangal rangashaipet)లో వృద్ధుడైన శేర్ల చంద్రమౌళికి చెందిన 20 గుంటల భూమిని నకిలీ పత్రాలతో తన పేరు మీద అక్రమంగా పొందినట్లు ఆరోపణలు వచ్చాయి.
బాధితులు ఇటీవల వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్‌ను ఆశ్రయించడంతో.. దీనిపై విచారణ చేయాల్సిందిగా టాస్క్‌ఫోర్స్ ఏసీపీ ఎం. జితేంద్రరెడ్డిని ఆయన ఆదేశించారు. కొంత భూమిని తన కుమార్తెకు రిజిస్ట్రేషన్ చేసే సమయంలో చంద్రమౌళికి సహకరించిన యుగంధర్ 2015లో చంద్రమౌళి కుమారుల ఫోర్జరీ సంతకాలు, నకిలీ పత్రాలు సృష్టించి భూమిని తన పేరిట పొందినట్లు పోలీసుల విచారణలో తేలింది.
దీంతోపాటు చంద్రమౌళి అతని భార్య మణెమ్మ నుంచి యుగంధర్ బలవంతంగా 3.25 ఎకరాల భూమిని విక్రయించి వారి నుంచి రూ.13 లక్షల నగదును తీసుకున్నట్లు తెలిసింది. నకిలీ రుణ పత్రాల ద్వారా చంద్రమౌళి, మన్నెమ్మలను బయపెట్టి వారిని మోసం చేశాడని వెలుగులోకి వచ్చింది. మరోవైపు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో యుగంధర్‌పై ఎనిమిది కేసులు నమోదయ్యాయి. తదుపరి చర్యల నిమిత్తం నిందితుడిని మిల్స్ కాలనీ పోలీసులకు అప్పగించారు.