కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో కాంగ్రెస్ నేత, వార్ రూమ్ ఇంచార్జీ మల్లు రవి సీసీఎస్ విచారణకు హాజరయ్యారు. సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం ఆయనను మూడు గంటలపాటు ప్రశ్నించారు. ఆ తర్వాత మీడియాతో మల్లు రవి మాట్లాడారు. వార్ రూమ్‌కు తనే ఇంచార్జీని అని తెలిపారు. దీనికి సంబంధించి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని వివరించారు. ఉద్యోగుల వివరాలను కూడా పోలీసులకు తెలిపానన్నారు.
కేసుకు సంబంధించి అవసరమైతే మళ్లీ పిలుస్తామని పోలీసులు చెప్పారని మల్లు రవి వివరించారు. కాంగ్రెస్ వార్ రూమ్ ఇంచార్జీగా తానే ఉన్నానని, అక్కడ జరిగిన వ్యవహారాలకు తానే బాధ్యత వహిస్తానని తెలిపారు. ఇంతకుముందు మల్లు రవి మాట మార్చారు. తొలుత తానే ఇంచార్జీనని, తనకే నోటీసులు ఇవ్వాలని చెప్పారు. ఆ తర్వాత తనకు సంబంధం లేదన్నారు. కానీ పోలీసులు సునీల్ కనుగోలును విచారించిన తర్వాత.. మల్లు రవిని నిందితుడిగా చేర్చారు. ఆ మేరకు బుధవారం ప్రశ్నించారు.
మదాపూర్‌లో కాంగ్రెస్ సోషల్ మీడియా వార్ రూమ్ ఆఫీసు ఉంది. దీనికి మల్లు రవి బాధ్యుడు కాగా.. సునీల్ కనుగోలు నేతృత్వంలో పని సాగుతుండేది. అక్కడున్న సిబ్బంది సీఎం కేసీఆర్, కవితకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టేవారు. దీంతో సీసీఎస్ పోలీసులు రైడ్ చేశారు. అక్కడినుంచి హార్డ్ డిస్క్ కూడా తీసుకెళ్లారు. ప్రాథమిక విచారణ ఆధారంగా మల్లు రవి పేరు తెరపైకి వచ్చింది. తాము ఎవరినీ కించపరచడం లేదని మల్లు రవి అంటున్నారు. నిబంధనలకు లోబడి మాత్రమే పోస్టులు చేస్తున్నామని పేర్కొన్నారు.