»Key Instructions On Police Appointments Revanth Reddy Gave Good News To Them
Telangana: పోలీసు నియామకాలపై కీలక ఆదేశాలు..వారికి శుభవార్త చెప్పిన రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పోలీసు నియామకాల ప్రక్రియ గురించి సమీక్షా సమావేశం నిర్వహించారు. త్వరలోనే పోలీసు నియామకాలకు సంబంధించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ (Telangana)లో పోలీసు నియామక ప్రక్రియను (Police Recruitments) వెంటనే చేపట్టాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అధికారులను ఆదేశించారు. సచివాలయంలో నేడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన పోలీస్, వైద్య ఆరోగ్య శాఖల్లో నియామకాలపై ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహించారు. ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎలాంటి పారదర్శకత లేకుండా, అవకతవకలకు పాల్పడకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకూ జరిగిన ఉద్యోగ నియామకాలపై నివేదిక ఇవ్వాలని సూచించారు. సాధ్యమైనంత త్వరగా పోలీస్ ఉద్యోగ నియామకాల ప్రక్రియను (Police Recruitment Process) పూర్తి చేయాలన్నారు. గత ఏడెనిమిది ఏళ్లుగా హోమ్ గార్డుల నియామకాలు లేవని, పోలీసు శాఖలో మరింత సమర్థవంతంగా ఆ సేవలు వినియోగించుకునేందుకు హోమ్ గార్డుల నియామకాలు జరగాలన్నారు.
హైదరాబాద్ (Hyderabad)లో ట్రాఫిక్ క్రమబద్దీకరణకు హోమ్ గార్డుల సేవలను మరింత విస్తృత స్థాయిలో వినియోగించుకోవాలని తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో అధికారులను పలు ప్రశ్నలు అడిగి సీఎం రేవంత్ రెడ్డి సమాధానాలు తెలుసుకున్నారు. సమీక్షా సమావేశానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర అధికారులు పాల్గొని పలు విషయాల గురించి తెలియజేశారు.