వేములవాడ నియోజకవర్గంలో నేడు మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై, బీజేపీ పెద్దలపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ సింహం లాంటి వాడని, సింగిల్ గానే వస్తాడని అన్నారు. బీఆర్ఎస్ గెలిస్తే వేములవాడను దత్తత తీసుకుంటానని కేటీఆర్ ప్రకటించారు.
సీఎం కేసీఆర్ (CM KCR)ను ఓడించేందుకు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారని, కేసీఆర్ సింహం అని, ఆయన సింగిల్గానే వస్తారని మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. పందులే గుంపులు గుంపులుగా వస్తాయని చమత్కరించారు. సోమవారం మంత్రి కేటీఆర్ వేములవాడ(Vemulawada)లో ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ..తెలంగాణ (Telangana)లో ఇప్పుడు బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ పార్టీల (Congress Party) మధ్య పోరాటం జరుగుతోందన్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని కొన్ని వ్యాఖ్యలు చేశారన్నారు.
డీకే శివకుమార్ (DK Shivakumar) స్వయంగా తమ రాష్ట్రంలో ఐదు గంటల విద్యుత్ (Electricity) ఇస్తున్నట్లు చెప్పారని, అదే తెలంగాణలో అయితే 24 గంటలపాటు బీఆర్ఎస్ కరెంట్ ఇస్తోందని గుర్తు చేశారు. 5 గంటల పాటు విద్యుత్ అని చెప్పినందుకు ఆ కాంగ్రెస్ నేతలను (Congress Leaders) తెలంగాణ ఎన్నికల ప్రచారానికి అస్సలు పిలవడం లేదన్నారు.
ఈ ఎన్నికలు ఢిల్లీ దొరలకు, తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్నాయని, ఎవరు గెలుస్తారో డిసెంబర్ 3వ తేదినే తేలిపోతుందన్నారు. ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాల నుంచి వచ్చివారి వల్ల ఏమీ కాదని, తెలంగాణ భవిష్యత్తుపై ఢిల్లీలో నిర్ణయం తీసుకోవాలా? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందుతోందని, పదేళ్ల పాటు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దూసుకెళ్లేలా పాలన సాగిందని కేటీఆర్ అన్నారు.
కేసీఆర్ అంటే తెలంగాణ భరోసా అని, సెంటిమెంట్లకు, అపాయింట్మెంట్లకు ఎవ్వరూ లొంగొద్దని పిలుపునిచ్చారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గతంలో సోనియా గాంధీని బలిదేవత అని అన్నారని కేటీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ గెలిస్తేనే మళ్లీ వేములవాడలో అడుగుపెడతానని అన్నారు. వేములవాడ బీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మీనర్సింహారావును అధిక మెజార్టీతో గెలిపిస్తే నియోజకవర్గాన్ని తాను దత్తత తీసుకుంటానని ప్రకటించారు.