సీఎం కేసీఆర్(CM KCR) తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) ఆరోపించారు. ఇప్పటికే 6 లక్షల కోట్లు అప్పులు చేసి ఇప్పుడు హైదరాబాద్ భూములపై పడ్డారని విమర్శించారు.
యోగా మహోత్సవానికి కూడా తెలంగాణ మంత్రులు దూరంగా ఉన్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) అన్నారు. దీంతోపాటు సీఎం కేసీఆర్(cm kcr) నీతి అయోగ్ సమావేశానికి కూడా హాజరు కాలేదని గుర్తు చేశారు. అలా చేయడం వల్ల రాష్ట్రానికే నష్టమని పేర్కొన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన యోగా మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి ఈ మేరకు వెల్లడించారు.
రాష్ట్రంలో ప్రజల పాలన గురించి అసలు కేసీఆర్(KCR) పట్టించుకోవడం లేదని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. అంతేకాదు తెలంగాణలో కేసీఆర్ కుటుంబానికి అప్పుల దాహం ఇంకా తీరడం లేదని ఆరోపించారు. ఇప్పటికే రైతులకు ఇవ్వాల్సిన రుణాలు ఇంకా రూ.50 వేల కోట్లు పెండింగ్లో ఉన్నాయని గుర్తు చేశారు. దీంతోపాటు ఉద్యోగస్థులకు సమాయానికి జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా రాష్ట్రంలో లేదన్నారు. మరోవైపు ఇంకా ఇష్ట్యా రాజ్యంగా అప్పులు చేసేందుకు సిద్ధమవుతున్నారని చెప్పారు. ఇంకా అప్పులు తీసుకుంటా అంటే కేంద్రం అడ్డు పడుతున్నదని తెలంగాణ నేతలు మాట్లాడుతున్నారని గుర్తు చేశారు. తెలంగాణలో బడ్జెట్లో చూపించిన లెక్కల ప్రకారం రూ.3.50 లక్షల కోట్లు అప్పు ఉండగా..ప్రస్తుతం అది కాస్తా మొత్తం 6 లక్షల కోట్లు దాటేసిందని కిషన్ రెడ్డి వెల్లడించారు. అప్పులు చేసి రాష్ట్రాన్ని కేసీఆర్ భ్రష్టుపట్టిస్తున్నారని దుయ్యబట్టారు.
దీంతోపాటు బీఆర్ఎస్(BRS) పార్టీ కోసం KCR అడ్డగోలుగా ఖర్చుచేస్తున్నారని విమర్శించారు. ఆ క్రమంలో మహారాష్ట్రలో పనికిమాలిన వారిని పార్టీలో చేర్చుకోవడం తప్ప ఏమీ లేదని అన్నారు. అసలు కేసీఆర్ తెలంగాణలో పేదరికం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే అనేక ప్రాజెక్టుల ద్వారా వేల కోట్ల రూపాయలు దోచుకున్న కేసీఆర్ ఇప్పుడు హైదరాబాద్ భూముల మీద పడ్డారని పేర్కొన్నారు. 111 జీవో రద్దు చేసి మరో దోపిడీకి ప్లాన్ చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు.