కొత్త పార్లమెంట్ (New Parliament) భవన ప్రారంభోత్సవానికి హాజరయ్యే విషయంలో బీఆర్ఎస్ (BRS) సంచలన నిర్ణయం తీసుకున్నాది. పార్లమెంట్ నయా భవన ఓపెనింగ్ దూరంగా ఉండాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పార్టీ నిర్ణయాన్ని రేపు (మే 27) అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. 28వ తేదీన నూతన పార్లమెంట్ భవనాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. అయితే, కాంగ్రెస్ పార్టీ (Congress party) సమన్వయంతో ఇప్పటికే 19 పార్టీలు పార్లమెంట్ ప్రారంభోత్సవానికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి బీఆర్ఎస్ కూడా చేరినట్లు తెలుస్తోంది. పార్లమెంట్ భవనాన్ని మే 28న ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఇప్పుడీ వ్యవహారం దుమారం రేపుతోంది. రాజకీయ రగడకు దారితీసింది. పార్లమెంటును ప్రధాని మోదీ(PM MODI) తో కాకుండా రాష్ట్రపతితో ప్రారంభింపజేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకి చేరింది.
రాష్ట్రపతి (President) తో ప్రారంభించేలా లోక్ సభ సెక్రటేరియట్ కు, కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని సుప్రీంకోర్టులో పిల్ వేశారు. అయితే, ఈ పిల్ పై విచారణ జరిపేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం నో చెప్పింది. సుప్రీంకోర్టు (Supreme Court) న్యాయవాది సీఆర్ జయ సుకిన్ వేసిన పిల్ పై జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ పీఎస్ నరసింహాతో కూడిన ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ‘‘మీరు ఇలాంటి పిటిషన్లను ఎందుకు దాఖలు చేస్తున్నారో మాకు తెలుసు. దీన్ని స్వీకరించడానికి మేము సిద్ధంగా లేము’’ అని సుప్రీంకోర్టు తెలిపింది. ‘‘మీకు ఎలాంటి జరిమానా విధించనందుకు సంతోషించండి’’ అంటూ హెచ్చరికలు జారీ చేసింది. వ్యాజ్యాన్ని కొట్టివేయాలని బెంచ్ నిర్ణయించింది. కోర్టు వ్యాఖ్యలతో తన పిల్ (Pill) ను ఉపసంహరించుకునేందుకు పిటిషనర్ అనుమతి కోరారు. తెలుగుదేశం (TDP), వైఎస్సార్సీపీ, బిజూ జనతాదళ్, శిరోమణి అకాలీదళ్ లాంటి ప్రాంతీయ పార్టీలన్నీ ప్రారంభోత్సవానికి హాజరుకావాలని నిర్ణయించాయి. ఈ పార్టీలన్నీ పరోక్షంగా బీజేపీ(BJP) కి మద్దతు పలుకుతున్నవే అనే అభిప్రాయం ఉన్నది. బీఆర్ఎస్ మాత్రమే అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్కు చెందకుండా ఏకాకిగా మిగిలింది.