ఎన్డీయో మునిగిపోయే నావ అని..అందులో ఎవరూ చేరరని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. నేను సీఎం కావడానికి ప్రధాని మోదీ పర్మిషన్ అవసరం లేదని కేటీఆర్ అన్నారు. మా ఎమ్మెల్యేలు, తెలంగాణ ప్రజల అనుమతి చాలు. గత ఎన్నికల్లో 105 స్థానల్లో బీజేపీ (BJP) డిపాజిట్లు గల్లంతు అని కేటీఆర్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఒక్క ఎంపీ కూడ గెలవద్దని ఆయన అన్నారు. నిజామాబాద్ (Nizamabad) సభలో ఆయన చెప్పినవన్నీ అబద్ధాలేనని, ఆయన యాక్టింగ్‌కు ఆస్కార్ తప్పకుండా వస్తుందని ఎద్దేవా చేశారు. ఆయన స్క్రిప్ట్ రాస్తే సినిమాలు తప్పకుండా విజయం సాధిస్తాయన్నారు.తెలంగాణ గురించి పూర్తిగా తెలుసుకోకుండా మిడిమిడి జ్ఞానంతో మాట్లాడారని మండిపడ్డారు.
ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తులు అబద్ధాలు చెప్పడం సరికాదన్నారు. ఇక నుంచి ఎవరైనా ప్రధాని మోదీని కలిసినప్పుడు వారి మధ్య జరిగే సంభాషణను రికార్డ్ చేసుకుంటే మంచిదన్నారు. ఎన్డీయే (NDA) లో కలవాలని ఎవరూ అనుకునే పరిస్థితి లేదని, ఆ కూటమి నుంచే పార్టీలు బయటకు వచ్చాయన్నారు.ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన పార్టీల పైకి ఈడీ, సీబీఐ (CBI)ని ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. బీజేపీలో చేరిన వారిపై ఏమైనా కేసులు ఉంటే వెనక్కి పడిపోతున్నాయన్నారు. ఈ తొమ్మిదేళ్లలో తెలంగాణకు ఏం ఇచ్చారో చెప్పాలన్నారు. బీజేపీ అంటే బిగ్గెస్ట్ జూమ్లా పార్టీ అని విమర్శించారు. ఎన్డీయే మునిగిపోయే నావ అని, అలాంటి దానిని ఎక్కాలని ఎవరూ అనుకోరన్నారు.