టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీకి హైకోర్టులో ఊహించని షాక్ ఎదురైంది. ఈ ఎమ్మెల్యే కొనుగోలు కేసు విచారణను సీబీఐకు అప్పగించడాన్ని హైకోర్టు నిరాకరించడం గమనార్హం. బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి వేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. దీనిపై వాదనలు విన్న హైకోర్టు సిట్ దర్యాప్తు కొనసాగించాలంటూ ఆదేశించింది.
ఈ వ్యవహారంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. బీజేపీ నేత దాఖలు చేసిన పిటిషన్‌పై సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసుపై సిట్ ఆధ్వర్యంలోనే దర్యాప్తు కొనసాగించాలని హైకోర్టు స్పష్టం చేసింది. సిట్ చీఫ్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ నేతృత్వంలో దర్యాప్తు పారదర్శకంగా చేయాలని ఆదేశించింది. దర్యాప్తునకు సంబంధించిన విషయాలను మీడియాకు, రాజకీయనాయకులు వెల్లడించేందుకు వీల్లేదని చెప్పింది. కేసు దర్యాప్తుపై పురోగతిని ఈనెల 29న సమర్పించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.
మరోవైపు ఈ కేసులో నిందితులు పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను నాంపల్లిలోని ఏసీబీ న్యాయస్థానం కొట్టివేసింది. దర్యాప్తు సమయంలో నిందితులకు బెయిల్ ఇస్తే వారు కేసును, సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు.
ప్రాసిక్యూటర్ వాదనలతో ఏకీభవించిన ఏసీబీ న్యాయస్థానం నిందితుల బెయిల్ పిటిషన్ ను కొట్టి వేసింది. మరోవైపు ఈ కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్ పై బంజారాహిల్స్ పోలీసులు పిటి వారంట్ కోరుతూ నాం పల్లి న్యాయస్థానంలో వారంట్ దాఖలు చేశారు.
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో నందకుమార్ పై 2 కేసులు నమోదయ్యాయి. కేసు దర్యాప్తులో భాగంగా నిందితుని అరెస్ట్‌కు అనుమతివ్వాలని న్యాయస్థానాన్ని పోలీసులు కోరారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నందకుమార్ ఏ2గా ఉన్నాడు. ప్రస్తుతం చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.