ఇండియన్ రైల్వే (Indian Railways) లో మూడు లక్షలకు పైగా ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయని, వాటిని వెంటనే భర్తీ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ (Vinod Kumar) డిమాండ్ చేశారు. ఆయన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnav) కు లెటర్ రాశారు. రైల్వేలో 3.12 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలన్నారు. ఇందులో సౌత్ సెంట్రల్ రైల్వేలోనే 30 వేలకు పైగా ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. ఉద్యోగాలను భర్తీ చేయక పోవడం వల్ల ఉన్న సిబ్బందిపై పని ఒత్తిడి పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది పర్యవేక్షణ లోపానికి దారి తీసి, ప్రమాదాలకు కారణంగా మారుతోందన్నారు. కాబట్టి ఖాళీలను వెంటనే భర్తీ చేయాలన్నారు. రైల్వే శాఖలో సౌత్ సెంట్రల్ రైల్వే (South Central Railway) ప్రయాణీకులు, సరుకుల రవాణా ద్వారా అధిక ఆదాయం సమకూరుస్తూ కీలక పాత్ర పోషిస్తోందన్నారు.
తెలంగాణ (Telangana), ఆంధ్రప్రదేశ్ లతో పాటు కొంత భాగం కర్ణాటక, మహారాష్ట్రలలో దక్షిణ మధ్య రైల్వే సేవలు అందిస్తోందని తెలిపారు. సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో టికెట్ కలెక్టర్స్(Ticket Collectors), స్టేషన్ మాస్టర్స్, లోకో మోటివ్ పైలట్స్, ట్రాక్ మెంటేనర్స్, టెక్నికల్ స్టాఫ్, ఇతర పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. నిరంతరంగా రైల్వే ట్రాక్స్(Railway tracks) ను, సిగ్నల్స్ లైటింగ్స్ ను పర్యవేక్షణ చేసేందుకు తగిన స్థాయిలో సిబ్బంది లేని కారణంగా ప్రమాదాలకు చోటు కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. చాలీచాలని ఉద్యోగులు ఉన్న ప్రస్తుత తరుణంలో, ఉన్న సిబ్బందిపై పని ఒత్తిడి పెరుగుతుండటంతో మానసికంగా కృంగి పోతున్నారని తెలిపారు. రైల్వే శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, నిరంతరం వృత్తి శిక్షణ శిబిరాలు నిర్వహించాలని, ఉద్యోగులకు ఇన్సెంటివ్ లు ఇచ్చి ప్రోత్సహించాలని, రైలు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు.