Fees Extortion: స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి. ముక్కుపిండి ఫీజులు వసూల్ చేసేందుకు ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు సిద్ధంగా ఉన్నాయి. విద్యా హక్కు చట్టం, ప్రభుత్వ జీవోలను తుంగలో తొక్కుతున్నారు. దీంతో పేరంట్స్ వివిధ ఫీజులను (Fees Extortion) గుమ్మనకుండా కట్టేస్తున్నారు.
హైదరాబాద్ ఉమ్మడి జిల్లాలో డిస్ట్రిక్ ఫీ రెగ్యులేషన్ కమిటీ అనుమతి లేకుండా ఫీజులను పెంచేశారు. సీబీఎస్ఈ (cbse) చట్ట ప్రకారం ప్రతీ స్కూల్లో పేరంట్, టీచర్ అసోసియేషన్ ఏర్పాటు చేసి పేరంట్స్‌ను కమిటీలో భాగస్వామ్యులు చేయాలి. అప్పుడే ఫీజులపై నిర్ణయం తీసుకోవాలి. అలాంటి రూల్స్ ఏమీ పాటించడం లేదు. వన్ టైం ఫీజుగా అఫ్లికేషన్ ఫీజు రూ.100, రిజిస్ట్రేషన్ ఫీజు రూ.500, రీఫండబుల్ కాషన్ డిపాజిట్‌గా రూ.5 వేలకు మించకుండా ఫీజు తీసుకోవాల్సి ఉంది. సిటీలో వందల సంఖ్యలో ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. కార్పొరేట్ స్కూల్స్‌గా శ్రీ చైతన్య, నారాయణ, ఎస్ఆర్ ఉన్నాయి.
జీవో ఎంఎస్ 91 ప్రకారం ఫీజు వసూల్ చేయడం లేదు. జీవో ఎంఎస్ 246 ప్రకారం ప్రైవేట్ స్కూల్స్ నిర్వహణలో సమాజాన్ని భాగస్వామ్యం చేయాలనే అంశాన్ని తుంగలో తొక్కారు. ప్రొసిడింగ్స్ 780(2013) సెక్షన్ 8(1) ప్రకారం స్కూల్ బోర్డులపై ఇంటర్నేషనల్ (international), ఐఐటీ (iit), ఒలింపియాడ్, కాన్సెప్ట్ (concept), ఈ-టెక్నో (e-techno) అనేవి ఉంచొద్దు. జీవోఎంఎస్ సెక్షన్ 1(సీ) ప్రకారం బుక్స్, స్టేషనరీ, యూనిఫామ్ స్కూల్ మేనెజ్ మెంట్ సూచించే ఫలాన చోట కొనాలనే నిబంధన విధించొద్దు అని చట్టం చెబుతోంది.
జీవోఎంఎస్ నంబర్ 1 ప్రకారం స్కూల్స్ 5 శాతానికి తగ్గకుండా లాభాలను ఆశించాలి. వచ్చిన ఫీజుల్లో 50 శాతం ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించాలనే నిబంధన ఉంది. వీటిని కూడా ప్రైవేట్ స్కూల్స్ తుంగలో తొక్కాయి. ఎంఈవో కొరత ఉందని చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. దీంతో స్కూల్ యాజమాన్యాలు యధేచ్చగా దోపిడీ చేస్తున్నాయి.