Rythu Bandhu:రైతుబంధు (Rythu Bandhu) నిధులు విడుదల చేయొద్దని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టంచేసింది. మంత్రి హరీశ్ రావుకు (harish rao) నోటీసులు కూడా ఇచ్చింది. దీనిపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్దానికి దారితీసింది. మంత్రి హరీశ్ రావు వల్లే ఇలా జరిగిందని రేవంత్ అనగా.. కారణం కాంగ్రెస్ పార్టీ అని కల్వకుంట్ల కవిత విరుచుకుపడ్డారు.
రైతుబంధుతో ఓట్లు దండుకోవాలనే దురాశ, ఆత్రుత, అహంకారం తప్ప.. రైతులకు మేలు చేయాలనే ఆలోచన మామా-అల్లుళ్లకు లేదన్నారు. మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యల వల్లే రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని ఈసీ వెనక్కి తీసుకుందని వివరించారు. రైతులు ఆందోళన చెందొద్దని సూచించారు. 10 రోజుల్లో.. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టగానే రైతు భరోసా రూ.15 వేలు మీ ఖాతాల్లో వేస్తాం అని స్ఫష్టంచేశారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
రైతుబంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత, అహంకారం తప్ప, నిజంగా రైతులకు మేలు జరగాలన్న ఉద్ధేశం మామా – అల్లుళ్లకు లేదు.
హరీష్ రావు వ్యాఖ్యల కారణంగానే రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటున్నట్టు ఈసీ ఆదేశాలు ఇవ్వడం దీనికి నిదర్శనం.
రేవంత్ ట్వీట్‌కు కల్వకుంట్ల కవిత కౌంటర్ ఇచ్చారు. రైతు బంధు సాయం పంపిణీకి ఇచ్చిన అనుమతి ఈసీ విత్ డ్రా చేసుకోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు. రైతు బంధును ఆపేందుకు కాంగ్రెస్ నేతలు కష్టపడ్డారని.. వారు చేసిన ఫిర్యాదు వల్లే ఈసీ ఆ నిర్ణయం తీసుకుందని చెప్పారు. రైతు వ్యతిరేకతను కాంగ్రెస్ నేతలు మరోసారి చాటుకున్నారని విరుచుకుపడ్డారు. మొదట అనుమతి ఇచ్చి.. ఇప్పుడు బ్రేక్ వేయడానికి కారణం ఆ పార్టీ అని తేల్చిచెప్పారు. మీరు ఓటు వేసే ముందు ఆలోచించి వేయాలని వయోజనులను కోరారు. రైతు బంధు సాయం పంపిణీపై ఈసీ బ్రేక్ వేయడంతో.. బీఆర్ఎస్- కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.