CM Revanth orders officials to provide information on calculations of irrigation projects
CM Revanth: సాగునీటి రంగంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) దృష్టిసారించారు. సాగునీటి రంగానికి సంబంధించి ప్రతి నిర్ణయం పారదర్శకంగా ఉండాలని అధికారులకు స్పష్టం చేశారు. ప్రజలకు తెలియకుండా దాచే ప్రయత్నం చేయొద్దని.. అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని సున్నితంగా హెచ్చరించారు. వ్యవసాయ, నీటి పారుదల రంగాలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు అధికారులు పాల్గొన్నారు.
1956 నుంచి 2014 వరకు, 2014 నుంచి 2023 వరకు నిర్మించిన ప్రాజెక్టులు, నిర్మాణ వ్యయాలు, ప్రాజెక్టువారీగా సాగులోకి తెచ్చిన ఆయకట్టు వివరాలను సీఎం రేవంత్ (CM Revanth) అడిగారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి నివేదిక అందజేయాలని అధికారులకు స్పష్టంచేశారు. ఏ విషయం అయినా సరే జనాలకు నిజం తెలియజేయాలని సూచించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి ఒక్కో శాఖపై సమీక్ష చేస్తూ వస్తున్నారు. గత పాలకులు చేసిన తప్పుల గురించి పూర్తి వివరాలు తీసుకుంటున్నారు.