CM KCR: వైఎస్ షర్మిలపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ సీఎం కేసీఆర్ వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పరాయి రాష్ట్రం నుంచి వచ్చి డబ్బులు చల్లినంత మాత్రన ఎన్నికల్లో గెలవలేరన్నారు. షర్మిల తనపై పగబట్టిందని, నర్సంపేటలో బీఆర్ఎస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డిని గెలిపించాలని కోరారు.
తెలంగాణ ఎన్నికల్లో ప్రచారాలు జోరందకున్నాయి. ఎన్నికలకు మరికొన్ని రోజులే ఉండటంతో ప్రత్యర్థి నాయకులపై, పార్టీలపై విమర్శనాస్త్రాలను సందిస్తున్నారు. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ మొదటి సారి వైఎస్ షర్మిలపై మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో వైఎస్ షర్మిల తనపై పగ పెంచుకుందని కేసీఆర్ కీలక ఆరోపణలు చేశారు. నర్సంపేటలో ఆయన నేడు బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నర్సంపేటలో సమైక్యవాదులు, పరాయి రాష్ట్రం వాళ్లు వచ్చి జెండా పాతుతామంటూ చూస్తూ ఊరుకోమన్నారు. అందుకే షర్మిల తమపై పగబట్టిందన్నారు.
పరాయి రాష్ట్రం వాళ్లు వచ్చి డబ్బు సంచులు పంచి ఓడిస్తామని చెబితే మనం ఓడిపోదామా? దయచేసి అందరూ ఆలోచించాలని సీఎం కేసీఆర్ అన్నారు. మిషన్ భగీరథ నీళ్లు గెలవాలా? 24 గంటల కరెంటు గెలవాలా? ఏది గెలవాలో ప్రజలే ఆలోచించాలన్నారు. రైతులు బాగుండాలని రైతు బంధును తీసుకొచ్చినట్లు గుర్తు చేశారు. 24 గంటల ఉచిత కరెంట్, రైతు బంధు, రైతు బీమా వంటివి ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వమే 7500 కొనుగోలు కేంద్రాలను పెట్టి రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తోందన్నారు. రైతు బంధును రూ.16 వేలకు పెంచుతామన్నారు.
కృష్ణా, గోదావరి నదులు ఉన్నా ఆ నీళ్లను ఇవ్వడం కాంగ్రెస్ పార్టీకి చేతకాలేదన్నారు. 50 ఏళ్లు పాలించి కాంగ్రెస్ చేసిందేమీ లేదన్నారు. చేనేత కార్మికులను, రైతులను కాంగ్రెస్ పార్టీ ఆదుకున్న దాఖలాలు లేవన్నారు. నర్సంపేట బీఆర్ఎస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి ఎప్పుడూ ప్రజల మధ్యనే ఉంటాడని, బీఆర్ఎస్కే ఓటు వేసి గెలిపించాలన్నారు. సుదర్శన్ రెడ్డిని గెలిపిస్తే ఎన్నికల తర్వాత నర్సంపేటకు వచ్చే ఇక్కడే ఉంటానని, రింగ్ రోడ్డు వేయిస్తానని, కావాల్సిన పనులన్నీ చేయిస్తానని తెలిపారు.