కాంగ్రెస్ కీలక లీడర్, సీఎల్పీ నేత అయిన మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) తీవ్ర ఎండలతో వడదెబ్బకు గురయ్యారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా ఆయన ఇవ్వాల (మంగళవారం) నల్గొండ జిల్లా(Nalgonda District)లో పర్యటిస్తుండగా అస్వస్థతకు గురయ్యారు. నకిరేకల్ (Nakirekal) మండలం కేతపల్లిలో భట్టికి వడదెబ్బ సోకింది. ఇవ్వాల్టికి 97రోజుల పాదయాత్రను ఆయన పూర్తి చేసుకున్నారు. కాగా, భట్టి విక్రమార్కకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్టు చెప్పారు.
ప్రమాదకరమైన ఎండలో పాదయాత్ర చేయడం వల్ల బాడీ డీహైడ్రేట్ (Dehydrate) అయ్యిందని, షుగర్ లెవల్స్ తగ్గిపోయినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో పాదయాత్ర (Padayatra) కు కాస్త బ్రేక్ ఇవ్వాలని భట్టి నిర్ణయించుకున్నారని, ఆరోగ్యం కుదుటపడగానే యథావిధిగా పీపుల్స్ మార్చ్ (People’s March) సాగుతుందని ఆయన సన్నిహితులు తెలిపారు.కేంద్ర, రాష్ట్ర విధానాలతో సామాన్యులు ఎదుర్కొంటున్న ఇబ్బందులతో పాటు ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అమలుపై ప్రజలతో చర్చిస్తూ భట్టి తన పాదయాత్ర ద్వారా ప్రజలకు దగ్గరవుతున్నారు. ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఈ పాదయాత్రను సద్వినియోగం చేసుకుంటున్నారు.