»Charminar Excise Ci Sadiq Ali Lost Life In Lb Nagar Car Accident
Road Accident in Hyderabad :నిర్లక్ష్యపు డ్రైవింగ్, ఎల్బీ నగర్లో అక్కడికక్కడే మృతి చెందిన ఎక్సైజ్ సీఐ
హైదరాబాద్‌లో అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎక్సైజ్ సీఐ సాధిక్ అలీ అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. ద్విచక్ర వాహనంపై ఆయనతో పాటు ఉన్న మరో మరో ఎస్సై మొహినుద్దీన్‌కు గాయాలయ్యాయి. వివరాల్లోవి వెళితే...
Road Accident in Lb Nagar: ప్రజల భద్రత కోసం బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్న ఓ పోలీస్ ఆఫీసర్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలొదిలారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్లనే ఈ దారుణం జరిగినట్లు తెలుస్తోంది. మంగళవారం అర్ధరాత్రి హైదరాబాద్, ఎల్బీనగర్ ప్రాంతంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదం మృతుని కుటుంబ సభ్యులకు విషాదాన్ని మిగిల్చింది.
వివరాల్లో వెళితే… మృతి చెందిన ఎక్సైజ్ సీఐ సాధిక్ అలీ ఛార్మినార్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నారు. అలాగే గాయపడిన మొహినుద్దీన్ నారాయణగూడ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వీరిద్దరూ మలక్‌పేట్‌లోని ప్రభుత్వ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు.
మంగళవారం రాత్రి ఓ ఫంక్షన్‌కి వెళ్లి ద్విచక్ర వాహనంపై వీరిద్దరూ వెనుదిరిగి వస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో రాంగ్ రూట్లో వేగంగా వచ్చిన కారు వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో సాధిక్ అలీ అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. మొహినుద్దీన్ గాయాల పాలయ్యారు. అయితే ఈ యాక్సిడెంట్ తర్వాత కారు డ్రైవర్ అక్కడి నుంచి పరారైపోయాడు. పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.