బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కి ఊహించని షాక్ తగిలింది. శాసనసభలో ఆయన పై స్పీకర్ వేటు వేశారు. ఇటీవల తెలంగాణ వర్షాకాల సమావేశాలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే… ఆ సమావేశాలకు బీజేపీ నేతలకు ఆహ్వానించలేదు. ఈ విషయంపై ఈటల రాజేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి రోబోలో ప్రవర్తిస్తున్నారంటూ మండిపడ్డారు. కేసీఆర్ చెప్పింది మాత్రమే చేస్తున్నారని.. వేరే ఏదీ చేయడం లేదని విమర్శించారు.
ఉమ్మడి రాష్ట్రంలో పార్టీకి ఒక్క ఎమ్మెల్యే ఉన్నా బీఏసీ సమావేశానికి పిలిచేవారని, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం సభా సంప్రదాయాలను తుంగలో తొక్కుతోందని తప్పుబట్టారు. అయితే ఈటల రాజేందర్ వ్యాఖ్యలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈటల వెంటనే స్పీకర్‌కు క్షమాపణ చెప్పాలని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. మరోవైపు ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని స్పీకర్ కార్యాలయం ఆయనకు నోటీసులు జారీచేసింది.
ఈ క్రమంలోనే సోమవారం అసెంబ్లీ పున:ప్రారంభం కాగా ఈటల రాజేందర్ హాజరుకాలేదు. మంగళవారం ఈ వ్యవహారంపై చర్చ జరగ్గా మంత్రి ప్రశాంత్‌రెడ్డి మాట్లాడారు. స్పీకర్‌ని మరమనిషంటూ వ్యాఖ్యానించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పకపోవడంతో ఈటల రాజేందర్‌ను సస్పెండ్ చేయాలని ప్రతిపాదించారు. దీంతో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆయన్ని ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. వర్షాకాల సమావేశాలు ఈరోజు ముగియనున్నాయి.