BJP: కరీంనగర్ బీజేపీలో విభేదాలు పెరుగుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఉమ్మడి జిల్లా నేతలు నగరంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన నేతలు హాజరయ్యారు. జిల్లాలో కొందరికే ప్రాధాన్యత లభిస్తోందని నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. కరీంనగర్లో బండి సంజయ్కు బదులు సీనియర్ నేతలకు పార్లమెంట్ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లిలో కూడా సీనియర్లకే టిక్కెట్లు ఇవ్వాలని కోరారు. బండి సంజయ్ తీరుపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని సీనియర్ నేతలు వెల్లడించారు.
ఎంపీ బండి సంజయ్ తీరుతో కరీంనగర్ జిల్లాలో కమలం పార్టీ బలహీనపడిందని ఆ పార్టీ సీనియర్ నేతలు ఆరోపిస్తున్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొందరు నేతల వల్లే తాను ఓడిపోయానని సంజయ్ ప్రస్తావించారు. దీంతో బండి వ్యాఖ్యల నేపథ్యంలో అసంతృప్తుల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఎంపీ ఎన్నికలకు ముందు.. అసమ్మతి నేతల తీరుతో.. నాయకత్వానికి తలనొప్పిగా మారింది. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, సీనియర్ నాయకులు సుగుణాకర్రావు, కాసిపేట లింగయ్య హాజరయ్యారు.