»Attack On Barrelakka During Election Campaign Tension In Kolhapur
Barrelakka: ఎన్నికల ప్రచారంలో బర్రెలక్కపై దాడి..కొల్లాపూర్లో ఉద్రిక్తత
తెలంగాణ ఎన్నికల్లో కొల్లాపూర్ నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న బర్రెలక్క అలియాస్ శిరీషపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ సందర్భంగా బర్రెలక్క మీడియాతో మాట్లాడుతూ తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. తనను బెదిరించినా, డబ్బులు ఆశ చూపినా ఎన్నికల నుంచి తప్పుకునేది లేదని స్పష్టం చేశారు. తనకు పోలీస్ ప్రొటెక్షన్ కల్పించాలని కోరారు.
కొల్లాపూర్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బర్రెలక్క పోటీ చేస్తోన్న సంగతి తెలిసిందే. బర్రెలక్క సోషల్ మీడియా ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. బర్రెలక్కగా పాపులర్ అయిన శిరీషపై ఎన్నికల ప్రచారం సందర్భంగా దాడి జరిగింది. ఈ నేపథ్యంలో కొల్లాపూర్ వద్ద హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. పెద్దకొత్తపల్లి మండలం, వెన్నచర్ల గ్రామంలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ఆ సందర్భంగా ఆమెపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు.
ఎన్నికల ప్రచారంలో ఆ ఘటన జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా బర్రెలక్క అలియాస్ శిరీష్ మాట్లాడుతూ..తనపై ఏ పార్టీవారు దాడి చేశారో తెలియదని చెప్పింది. తాను ఎన్నికల బరిలో ఉంటే ఓట్లు చీలుతాయనే ఉద్దేశంతో తనపై దాడికి దిగుతున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమకు పోలీసు ప్రొటెక్షన్ కల్పించాలని బర్రెలక్క కోరింది. అర్థరాత్రి పూట తనకు ఫోన్లు చేసి భయపెడుతున్నారని, తన తమ్ముడిని కొట్టారని బర్రెలక్క ఆవేదన వ్యక్తం చేసింది.
నిరుద్యోగుల కోసం తాను మాట్లాడుతున్నానని, వారి కోసం పోటీలో నిలిచానని ఆమె తెలిపారు. తనకు ఏమైనా అయితే తన తల్లిదండ్రుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. తన నామినేషన్ను విత్ డ్రా చేసుకోవాలంటూ తనపై ఒత్తిడి తెచ్చారని, కొందరు బెదిరించారని, మరికొందరు డబ్బులు ఆశ చూపినా తాను మాత్రం వెనక్కి తగ్గలేదన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తనకు నిరుద్యోగులంతా మద్దతుగా నిలిచారని, ఆ ధైర్యంతోనే తాను పోటీలో ఉంటానని స్పష్టం చేశారు.