»Alert For Drug Party Excise Department Key Announcement
Telangana: మందు పార్టీ చేసుకునేవారికి అలర్ట్.. ఎక్సైజ్ శాఖ కీలక ప్రకటన
తెలంగాణ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న తరుణంలో ఎక్సైజ్ శాఖ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఎవరైనా పెద్ద ఎత్తున మద్యం కొనుగోలు చేస్తుంటే కచ్చితంగా రూ.100 బాండ్ పేపర్‌పై హామీ పత్రం రాసి ఇవ్వాలని, వారికి మాత్రమే మద్యం అనుమతి ఉంటుందని తెలిపింది. ఎన్నికల కోడ్ అమలులో ఉండే వరకూ మద్యం పార్టీలకు అనుమతి లేదని స్పష్టం చేసింది. అనుమతి ఉల్లంఘించిన వారిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ హెచ్చరించింది.
తెలంగాణ ఎన్నికల్లో (Telangana Elections) ముఖ్య భాగమైన నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఎన్నికలకు మరో 16 రోజులు ఉన్నాయి. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో అక్టోబర్ 10వ తేది నుంచే ఎన్నికల కోడ్ (Election code) అమల్లోకి వచ్చింది. దీంతో ఎన్నికల అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నాయి. పోలీసులు, ఎన్నికల అధికారులు ఎక్కడికక్కడ చెక్ పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలను నిర్వహిస్తూ వస్తున్నాయి. ప్రతిసారీ ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకర్షించేందుకు మద్యాన్ని ఎరగా చూపుతుంటారు. అందుకే ఈసారి అలాంటిది జరగకుండా ఎక్సైజ్ శాఖ (Excise Department) ప్రత్యేక దృష్టి పెట్టింది.
రాష్ట్రంలో మద్యం అమ్మకాలు, సరఫరాపై తెలంగాణ ఎక్సైజ్ శాఖ (Telangana Excise Department) ఫోకస్ పెట్టింది. తాజాగా కీలక ప్రకటన జారీ చేసింది. ఇంట్లో ఏవైనా దావత్‌లు, శుభకార్యాలు జరుగుతుందే మద్యం కొనుగోలు చేస్తుంటారు. అలా పెద్ద ఎత్తున లిక్కర్ కొనుగోలు చేస్తే ముందుగానే అనుమతి తీసుకోవాలని ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. పెద్ద ఎత్తున లిక్కర్ కొనుగోలు చేస్తే కచ్చితంగా రూ.100ల బాండ్ పేపర్‌పై ప్రత్యేక హామీ ఇవ్వాల్సి ఉంటుందని వెల్లడించింది.
తమకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదని చెబుతూ బాండ్ పేపర్‌పై హామీ ఇవ్వాలని ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రకటన చేశారు. ఎన్నికల కోడ్‌ను (Election Code) ఎవ్వరైనా ఉల్లంఘిస్తే మాత్రం చట్టరిత్యా చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ (Excise Department) అధికారులు హెచ్చరించారు. నవంబర్ 30వతేది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ (Elections Polling) జరగనుంది. డిసెంబర్ 3న కౌంటింగ్ జరిగి ఫలితాలను ప్రకటించే వరకూ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని, అప్పటి వరకూ రాష్ట్రంలో మద్యం పార్టీలకు ప్రత్యేక అనుమతి కచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుందని ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది.