చదువుకోవాలనే తపన ఉండాలేకానీ ఏ వయసు వారైనా చదువుకోవచ్చు. చాలా మంది వృద్ధాప్యంలోనూ చదువుకోవడానికి ఆసక్తి చూపుతుంటారు. తమ కన్నబిడ్డలతో పాటు చదువుకుని పరీక్షలు రాసి పాసైన వారు కూడా ఉన్నారు. తాజాగా ఓ తండ్రి తన కూతురుతో పాటు నీట్ పరీక్షలు(Neet Exams) రాశాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని 49 ఏళ్ల వ్యక్తి తన 17 ఏళ్ల కూతురితో కలిసి నీట్ పరీక్ష రాశాడు.
ఖమ్మంలో నివశించే రాయల సతీష్ బాబు(Rayala Satish Babu) అనే వ్యక్తి పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్ కు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. తాను మెడిసిన్(Medicine) చదవాలని అనుకున్నాడు. అయితే ఆ రోజుల్లో అది సాధ్యం కాలేదు. పరిస్థితులు అనుకూలించక 1997లో బీటెక్ పూర్తి చేసి ఓ కోచింగ్ సెంటర్ నడుపుతున్నాడు. నేషనల్ మెడికల్ కమిషన్ గత ఏడాది నీట్ పరీక్షకు వయోపరిమితిని ఎత్తివేయడంతో సతీష్ బాబులో చదువుకోవాలనుకునే ఆశ చిగురించింది. వయసు పెరిగినా తన కలను నెరవేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు.
తాను ఎలాగైనా ఎంబీబీఎస్(MBBS) పూర్తి చేసి హాస్పిటల్ పెట్టాలని, పేదలకు వైద్యం అందించాలని ఆశిస్తున్నాడు. అందుకే నీట్ పరీక్ష(Neet Exams) రాసినట్లు తెలిపాడు. నీట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించపోయినా యువతకు స్ఫూర్తిగా నిలుస్తానన్నారు. నీట్ లో ఈ ఏడాది పాస్ కాకుంటే వచ్చే ఏడాది లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని మళ్లీ పరీక్ష రాస్తానని వెల్లడించాడు. సతీష్ కూతురు జోషిక స్వప్నిక తన తండ్రితో పాటు నీట్ పరీక్ష రాయడం సంతోషంగా ఉందని తెలిపింది.