»220 Couples Get Married In Nagarkurnool With Mjr Charitable Trust
MJR Trust ఒక వేదిక.. ఒక ముహూర్తం.. ఏకమైన 220 జంటలు
ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న యువతీయువకులకు వివాహానికి ముందే వివాహా సామగ్రి (తాళిబొట్టు, పట్టువస్త్రాలు, బాసింగాలు, మేకప్ కిట్ సహా కొన్ని వస్తువులు) అందిస్తారు. నిర్ణయించిన ముహూర్తానికి బంధువులతో కలిసి వధూవరులు వస్తే చాలు. కొత్త జంటలకు కాపురానికి కావాల్సిన బీరువా, మంచం, పరుపు, దుప్పట్లు, 2 కుర్చీలు, వంట సామగ్రి, కుక్కర్, మిక్సీ తదితర సామగ్రి అందించారు.
ఆకాశమంత పందిరి .. భూదేవి అంతపీట వేసి అంటారు కదా అచ్చం అలాంటి వివాహ వేడుక (Marriage) తెలంగాణ (Telangana)లో జరిగింది. ఒక వివాహ వేదిక.. ఒకటే ముహూర్తం.. కానీ ఏకమైన జంటలు మాత్రం 220. ఒకటే ముహూర్తానికి 220 జంటలు ఏకమయ్యాయి. ఇది సినిమాలో సీన్ కాదు. వాస్తవంగా జరిగింది. ఉమ్మడి మహబూబ్ నగర్ (Mahabubnagar) జిల్లాలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లోనే (Telugu States) ఇలాంటి కల్యాణ వేడుక ఎక్కడా చూసీ ఉండరు. అయితే వధూవరులు తమ పెళ్లికి చేసుకున్న ఖర్చు ఒక్క రూపాయి కూడా కాకపోవడం విశేషం. ఊరు ఊరంతా పండగ వాతావరణంలో మునిగిపోయింది. ఈ వివాహాలను ఉచితంగా చేయించిన వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ నాగర్ కర్నూల్ (Nagarkurnool) ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి (Marri Janardhan Reddy).
ఇలా ఉచిత వివాహాలు దాదాపు పుష్కర కాలం నుంచి ఎమ్మెల్యే జనార్ధన్ రెడ్డి తన ఎంజేఆర్ ట్రస్ట్ (MJR Trust) ద్వారా చేయిస్తున్నారు. ప్రతి యేటా మాదిరి ఈ ఏడాది ఆదివారం (ఫిబ్రవరి 12) అంగరంగ వైభవంగా సామూహిక వివాహాలు నిర్వహించారు. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న యువతీయువకులకు వివాహానికి ముందే వివాహా సామగ్రి (తాళిబొట్టు, పట్టువస్త్రాలు, బాసింగాలు, మేకప్ కిట్ సహా కొన్ని వస్తువులు) అందిస్తారు. నిర్ణయించిన ముహూర్తానికి బంధువులతో కలిసి వధూవరులు వస్తే చాలు. అలా వచ్చిన వధూవరులకు నాగర్ కర్నూల్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అద్భుతం తీర్చిదిద్దిన సినిమా సెట్టింగ్ లాంటి కల్యాణ మండపంలో వివాహ తంతు జరిపించారు. అంతకుముందు యాదాద్రి (Yadadri) లక్ష్మీనరసింహాస్వామి కల్యాణోత్సవం చేయించారు. అనంతరం ఉదయం 10.05 గంటలకు శుభ ముహూర్తాన జంటలు ఏకమయ్యాయి.
జంటలకు భారీగా కానుకలు
బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ కె.కేశవరావు (K Keshava Rao), ఎంపీలు నామా నాగేశ్వర రావు, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు (Guvvala BalaRaju) తదితరులు వచ్చి దంపతులను ఆశీర్వదించారు. ‘ఎమ్మెల్యేగా నేను గెలిచినా.. ఓడినా వివాహ కార్యక్రమాలు మాత్రం కొనసాగిస్తా’ అని ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఎంజేఆర్ ట్రస్ట్ అధినేత మర్రి జనార్దన్ రెడ్డి తెలిపారు. ఇక కొత్త జంటలకు కాపురానికి కావాల్సిన బీరువా, మంచం, పరుపు, దుప్పట్లు, 2 కుర్చీలు, వంట సామగ్రి, కుక్కర్, మిక్సీ తదితర సామగ్రి అందించారు.
దమ్ముంటే వాళ్లు ఇలా చేయాలి: ఎమ్మెల్యే
మొత్తం 485 మంది జంటలకు వివాహాలు జరిపించిన ఎమ్మెల్యే జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. తనను పెళ్లిళ్ల పేరయ్యగా పిలవడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసమే తాను ఇలాంటి కార్యక్రమం చేస్తున్నానని విమర్శించే వారు దమ్ముంటే ఇలాంటి కార్యక్రమం చేయాలని సవాల్ విసిరారు. తల్లిదండ్రులు తమ ఆడపిల్లల పెండ్లి చేయడానికి ఇబ్బందులు పడుతుండడంతో తాను ఇలా వివాహాలు చేయిస్తున్నట్లు తెలిపారు. ఇలా వివాహాలు చేయించడానికి తమిళనాడులో తాను చూసిన ఓ సామూహిక వివాహా వేడుకనే స్ఫూర్తి అని ఎమ్మెల్యే జనార్ధన్ రెడ్డి వివరించారు. ఇక ముందు కూడా ఇలాంటి వేడుకలు నిర్వహిస్తానని స్పష్టం చేశారు.