cyber attacks in india : కేస్పర్ స్కి యాంటీ వైరన్ని మనం చాలా మంది కంప్యూటర్లలో ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటాం. కంప్యూటర్ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ పని చేస్తూ ఉంటాం. ఈ ప్రముఖ సైబర్ సెక్యూరిటీ (cyber security) సంస్థ అయిన కేస్పర్ స్కి మన దేశంలో సైబర్ క్రైం నానాటికీ పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. కంపెనీ విడుదల చేసిన నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది. గత ఏడాది మొత్తం 74 మిలియన్ల లోకల్ త్రెట్లను తాము నిలువరించినట్లు చెప్పింది.
ప్రపంచవ్యాప్తంగా సైబర్ దాడులు ఎక్కువగా జరుగుతున్న దేశాల్లో భారత్ 80వ స్థానంలో ఉంది. 2023లో 34 శాతం మంది కంప్యూటర్ యూజర్లకు స్థానిక బెదిరింపులు వచ్చాయని తెలిపింది. దాదాపుగా ఏడున్నర కోట్ల మందిపై జరిగిన సైబర్ అటాక్‌ను తమ సాఫ్ట్వేర్ ఆపినట్లు కేస్పర్స్కి వెల్లడించింది. వినియోగదారుల కంప్యూటర్లలోకి నేరుగా వస్తున్న స్పామ్ మెసేజ్‌లు లేదా ఫ్లాష్ డ్రైవ్స్, కెమెరా మెమోరీ కార్డులు, ఫోన్లు, ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్‌ల్లో తెలియకుండా వచ్చిన మెసేజ్‌లను గుర్తించి వాటి ఆధారంగా ఈ డేటాను రూపొందించారు. దేశంలో సుమారు 74,385,324 స్థానిక సైబర్ దాడుల్ని తాము నిలువరించామని వెల్లడించారు.
తమ యాంటీ వైరస్ ఉత్పత్తులు ఈ సైబర్ దాడుల్ని సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం కంప్యూటర్ల వినియోగం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఇలాంటి దాడులు కూడా మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పింది. ఈ క్రమంలోనే సైబర్ బెదిరింపులు కూడా ఎక్కువ అవుతున్నట్లు తెలిపింది. ఇప్పుడు అంతా డిజిటల్‌గా ఎక్కువ అనుసంధానమై ఉండటం వల్లనే ఈ ఇబ్బందులు పెరుగుతున్నాయని చెప్పింది.