ఏషియన్ గేమ్స్(Asian Games)లో భారత మహిళా జావెలిన్ త్రోయర్ అన్ను రాణి ఆసియా క్రీడల్లో సంచలన ప్రదర్శన కనబర్చింది. చైనా(China)లోని హాంగ్ ఝౌ నగరంలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో అన్ను రాణి (Annu Rani) అదిరిపోయే త్రో విసిరి పసిడి పతకం చేజిక్కించుకుంది. ఈ సీజన్ లోనే తన బెస్ట్ త్రో నమోదు చేసిన అన్ను రాణి జావెలిన్ ను 62.92 మీటర్ల దూరం విసిరి బంగారు పతకం అందుకుంది. అన్ను రాణి తన నాలుగో ప్రయత్నంలో ఈ సూపర్ త్రో విసిరింది. 61.57 మీటర్లతో శ్రీలంక క్రీడాకారిణి నదీష (Nadeesha) దిల్హాన్ రజతం గెలుచుకుంది. చైనాకు చెందిన హుయిహుయి ల్యూ 61.29 మీటర్లతో కాంస్యం దక్కించుకుంది. కాగా, అన్ను రాణి గెలుచుకున్న స్వర్ణంతో, ఆసియా క్రీడల్లో భారత్ పసిడి పతకాల సంఖ్య 15కి పెరిగింది.ఆసియా క్రీడల మహిళల జావెలిన్ త్రో విభాగంలో భారత్కు ఇదే తొలి స్వర్ణ పతకం కావడం విశేషం.