రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆటగాడు రియాన్ పరాగ్ ... ఒక్కసారిగా క్రికెట్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు. ఈ ఐపీఎల్ సీజన్లో మొదటి రెండు మ్యాచుల్లో తన సత్తా చాటుకున్నాడు. తన బ్యాటింగ్‌తో విమర్శకుల నోళ్లు మూయించాడు.
IPL 2024: రియాన్ పరాగ్ 2019 నుంచి ఐపీఎల్ ఆడుతున్నాడు. ఎంతో చురుగ్గా ఉండే పరాగ్.. స్టేడియంలో తన హావభావాలతో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచేవాడు. ఆటలో మాత్రం ఎప్పుడూ వెనకబడేవాడు. ఫీల్డింగ్ విషయంలో సరైన శ్రద్ధ కనబరిచేవాడు కాదు. దీంతో అనేక మంది క్రికెట్ అభిమానులు రియాన్ పరాగ్‌పై విమర్శల వర్షం కురిపించారు. మైదానంలో కనిపిస్తే చాలు ఎగతాళి చేసేవారు.. అంచనాలు అందుకోవడం లేదంటూ విమర్శలు గుప్పించారు. నిలకడ లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇంటర్నెట్లో కూడా అడ్డగోలు కామెంట్లు.. ఇలా ఎంతో అప్రతిష్టను మూటకట్టుకున్నాడు రియాన్ పరాగ్.
ఇటువంటి విమర్శల దాడిని ఎదుర్కొన్న రియాన్ పరాగ్ ఎప్పుడూ కుంగిపోలేదు.. ఈ సీజన్లో ఎంతో పట్టుదల కనబరుస్తున్నాడు. పరుగుల వరద పారిస్తున్నాడు. అస్సాం రాష్ట్రానికి చెందిన రియాన్ పరాగ్ గత కొంత కాలంగా డొమెస్టిక్ క్రికెట్లో ఇరగదీస్తున్నాడు. పరుగుల వరద పారిస్తున్నాడు. అదే ఊపును ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్లో జట్టు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ కీలక ఇన్నింగ్స్‌లతో విజయాల్లో ప్రధాన పాత్ర పోషించాడు. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో 29 బంతుల్లో 43 పరుగులు చేశాడు. ఆ తర్వాత మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగించాడు.
ఢిల్లీపై 45 బంతుల్లో 84 పరుగులు చేశాడు. ముఖ్యంగా ఢిల్లీతో మ్యాచ్‌లో 36/3తో కష్టాల్లో ఉన్న జట్టును అద్భుత బ్యాటింగ్‌తో ఆదుకున్నాడు. ఈ సీజన్లో అతను నాలుగో స్థానంలో బరిలో దిగుతూ రాణిస్తున్నాడు. దేశవాళీల్లో సయ్యద్ ముస్తాక్ అలీ, దేవధర్ ట్రోఫీ, రంజీల్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అదరగొట్టిన రియాన్‌కు రాజస్థాన్ కూడా మద్దతుగా నిలిచింది. ఈ సీజన్లో అతణ్ని బ్యాటింగ్ ఆర్డర్లో పైకి తీసుకొచ్చింది. అదే అతడి విజయానికి దోహదం చేస్తోంది.