నేడు విడుదల చేసిన ఐసీసీ ర్యాకింగ్స్లో టీమిండియా ఆటగాళ్లు సత్తా చాటారు. వన్డే, టీ20, టెస్ట్ ఫార్మాట్లలో భారత క్రికెటర్లు ర్యాంకులతో మెరిశారు. మూడు ఫార్మాట్లలోనూ టీమిండియా మొదటి స్థానంలో కొనసాగుతోంది.
వన్డే వరల్డ్ కప్ టోర్నీలో టీమిండియా తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఈ తరుణంలో తాజాగా ఐసీసీ ర్యాకింగ్స్ను ప్రకటించింది. ఈ ర్యాంకుల్లో కూడా టీమిండియా ఆటగాళ్లు దుమ్ములేపారు. అన్ని ఫార్మాట్లలోనూ భారత ఆటగాళ్లు అగ్రస్థానాల్లో నిలిచారు. ఐసీసీ ప్రకటించిన ఈ ర్యాకింగ్స్లో టీమిండియా యువ ఓపెనర్ అయిన శుభ్మన్ గిల్ మొదటి స్థానంలో నిలిచారు. పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరుకున్నాడు. అలాగే బౌలింగ్లో మహ్మద్ సిరాజ్ నెంబర్ వన్ స్థానానికి చేరుకున్నాడు.
ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్ జాబితా:
వన్డే ర్యాంకింగ్స్ చూస్తే శుభ్మన్ గిల్ 830 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా 770 పాయింట్లతో విరాట్ కోహ్లీ 4వ స్థానంలో కొనసాగుతున్నాడు. అలాగే 739 పాయింట్లతో రోహిత్ శర్మ 6వ స్థానంలో ఉన్నాడు. బౌలర్లలో 709 పాయింట్లతో మహ్మద్ సిరాజ్ మొదటి స్థానంలో ఉండగా 661 పాయింట్లతో 4వ స్థానంలో కుల్దీప్ యాదవ్, 654 పాయింట్లతో 8వ స్థానంలో బుమ్రా, 635 పాయింట్లతో మహ్మద్ షమీ 10వ స్థానంలో నిలిచారు.
ఇకపోతే టీ20లల్లో 863 పాయింట్లతో టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అగ్రస్థానంలో నిలిచాడు. టెస్టు మ్యాచుల్లో టాప్10 బ్యాటర్లలో రోహిత్ శర్మ 10వ స్థానంలో ఉన్నాడు. ఇక బౌలర్ల జాబితాలో రవిచంద్రన్ అశ్విన్ మొదటి స్థానం, రవీంద్ర జడేజా 3వ స్థానంలో నిలిచారు. టెస్టు ఆల్ రౌండర్ల జాబితాలో జడేజా అగ్రస్థానంలో ఉండగా 2వ స్థానంలో అశ్విన్, 5వ స్థానంలో అక్షర్ పటేల్ నిలిచారు.
ఇకపోతే వన్డే (ODI), టీ20 (T20), టెస్ట్ ఫార్మాట్లలో (Test Formates) భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. టెస్టుల్లో 118 రేటింగ్ పాయింట్లు, వన్డేల్లో 121 రేటింగ్ పాయింట్లు, టీ20లలో 265 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది. టీమిండియా (Team India) ఆటగాళ్ల ర్యాకింగ్స్ (Icc Rankings) పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.