»Another Sensation In The World Cup Netherlands Great Victory Over Bangladesh
BAN vs NED: వరల్డ్‌కప్‌లో మరో సంచలనం..బంగ్లాదేశ్‌పై నెదర్లాండ్స్ ఘన విజయం
నేటి వన్డే వరల్డ్ కప్ టోర్నీలో బంగ్లాదేశ్‌పై నెదర్లాండ్స్ జట్టు ఘన విజయం సాధించింది. బంగ్లా జట్టు 142 పరుగులకే ఆలౌట్ అవ్వడంతో నెదర్లాండ్స్ టీమ్ 87 పరుగుల తేడాతో ఘన విజయాన్ని పొందింది.
ఈ వరల్డ్ కప్ టోర్నీలో నెదర్లాండ్స్ సంచలన విజయం సాధించింది. బంగ్లాదేశ్ జట్టును ఓడించి ఘన విజయాన్ని నమోదు చేసింది. నేడు కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఈ మ్యాచ్ జరిగింది. నెదర్లాండ్స్ జట్టు 87 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ జట్టును చిత్తు చేసి విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఆరెంజ్ ఆర్మీ 50 ఓవర్లలో 229 పరుగులు చేసి ఆలౌటయ్యింది. నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ 68 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఈ టీమ్‌లో ఎంగెల్ బ్రెక్ట్ 35 పరుగులు చేసి ఆ తర్వాతి స్థానంలో నిలిచాడు.
230 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టు ఆ స్కోరును అందుకోలేకపోయింది. మ్యాచ్‌లో ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. నెదర్లాండ్స్ బౌలర్లకు తడబడింది. దీంతో చివరికి 42.2 ఓవర్లలో 142 పరుగులకే ఆలౌట్ అయ్యింది. నెదర్లాండ్స్ జట్టులో పాల్ వాన్ మీకెరెన్ 4 వికెట్లు తీశాడు. బాస్ డీ లీడ్ 2, ఆర్యన్ దత్ 1, లోగాన్ వాన్ బీక్ 1, కోలిన్ అకెర్ మన్ 1 వికెట్ పడగొట్టారు.
బంగ్లా బ్యాటర్లలో మెహిదీ హసన్ మిరాజ్ 35, మహ్మదుల్లా 20, ముస్తాఫిజూర్ రెహ్మాన్ 20 పరుగులు చేయగలిగారు. ఓపెనర్లు లిట్టన్ దాస్ 3, టాంజిద్ హుస్సేన్ 15 పరుగులకే పెవిలియన్ బాట పట్టారు. 70 పరుగులకే బంగ్లాదేశ్ జట్టు 6 వికెట్లు కోల్పోయింది. ఆఖరికి 142 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో నెదర్లాండ్స్ జట్టు ఘన విజయం సాధించింది. ఈ విజయంతో నెదర్లాండ్స్ జట్టు పాయింట్ల పట్టికలో 8వ స్థానంలోకి చేరింది. బంగ్లా జట్టు 9వ స్థానానికి పడిపోయింది.